కొరాపుట్: సకాలంలో వడ్డీలు కట్టకపోతే ఖాతాదారుల భవనాలకు బ్యాంక్‌లు తాళాలు వేయడం మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ బ్యాంక్‌కే భవన యజమాని తాళాలు వేసిన ఘటన జరిగింది. మంగళవారం నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ పట్టణంలో డీఎన్‌కే కాలనీ బ్యాంక్ ఆఫ్ బరోడా కార్యాలయానికి తాళాలు పడ్డాయి. ఈ బ్యాంక్‌కి సుధీర్ చౌదరి తండ్రి భవనాన్ని అద్దెకి ఇచ్చారు. తర్వాత సుధీర్ తండ్రి చనిపోయారు. అద్దె అగ్రిమెంట్ కూడా ముగిసిపోయింది. సుధీర్ తన అగ్రిమెంట్ ని పునరుద్ధరించాలని బ్యాంక్‌ను కోరారు. వారి నుంచి స్పందన లేకపోవడంతో లీగల్ నోటీస్ పంపించినా ఫలితం లేకపోయింది. గత 6 నెలలుగా అద్దె చెల్లించక పోవడం తో యజమాని విసిగి బ్యాంక్‌కి తాళాలు వేసి ధర్నాకి దిగారు. ఖాతాదారులు బ్యాంక్ వద్దకు వచ్చి వెనుదిరుగుతున్నారు.
సీఎంఓ ఫైళ్ల గల్లంతుపై విచారణ
భువనేశ్వర్: ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి నాయుడు కమిషన్ నివేదిక అదృశ్యంపై ఒడిశా క్రైమ్ బ్రాంచ్ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో సాంకేతిక దర్యాప్తు కొనసాగుతోందని, ఆధారాలు లభించిన కొద్దీ మరికొంత మందిని ప్రశ్నించే అవకాశం ఉందని క్రైం శాఖ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి క్రైమ్ బ్రాంచ్ డైరెక్టర్ జనరల్ (డీజీ) వినయ్‌తోష్ మిశ్రా మాట్లాడుతూ గల్లంతైన ఫైల్‌కు సంబంధించిన పరిస్థితులను వెలికితీసేందుకు సాంకేతిక, శాసీ్త్రయ పద్ధతులను ఉపయోగించి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ రాబోయే రోజుల్లో మరికొంత మందిని ప్రశ్నించే అవకాశం ఉందని డీజీ తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు తేలిన వారెవరైనా దర్యాప్తుకు సహకరించి దర్యాప్తు సంస్థ జారీ చేసిన అధికారిక నోటీసులకు స్పందించాల్సి ఉంటుందని అన్నారు. దర్యాప్తు ఇంకా కీలక దశలోనే ఉంది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్ధారణలకు రాకూడదు. వివరణాత్మక దర్యాప్తు క్రమంలో సేకరించిన అన్ని సాక్ష్యాలు, వాంగ్మూలాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఫైలు అదృశ్యం వెనుక ఉన్న నిజం వెలుగులోకి వస్తుందన్నారు. నోటీసులు అందుకున్న వారు విచారణ నుంచి తప్పించుకోలేరని క్రైం శాఖ హెచ్చరించింది. దర్యాప్తు అవసరాలను బట్టి వివిధ వ్యక్తులకు దశల వారీగా నోటీసులు జారీ చేస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభ దశలో ఉంది. హోం శాఖ నుంచి మొదలుకొని ప్రధాన కార్యదర్శి కార్యాలయం మీదుగా ముఖ్యమంత్రి కార్యాలయం వరకు ఫైలు కదలికతో సమగ్ర ప్రక్రియను దర్యాప్తు బృందం అధ్యయనం చేసింది. గల్లంతు అయిన ఫైలు వివిధ ప్రక్రియలు మరియు దానిని ఎలా నిర్వహిస్తున్నారనే దానిపై దర్యాప్తు బృందం ఆ మూడు శాఖల కార్యాలయాలకు లేఖలు రాసింది. దర్యాప్తుకు సహాయపడటానికి ఒక నోడల్ అధికారిని నియమించాలని ఈ లేఖలో కోరినట్లు క్రైమ్ శాఖ డైరెక్టర్ జనరల్ అన్నారు.
రాణిపేటలో తిరంగ పతాక యాత్ర
పర్లాకిమిడి: కాశీనగర్ బ్లాక్ కె.సీతాపురం పంచాయతీ రాణిపేట గ్రామంలో మంగళవారం బీజేపీ మండల సమావేశం, తిరంగా పతాక యాత్రను జిల్లా సాధారణ కార్యదర్శి జగన్నాథ మహాపాత్రో ఆధ్యక్షతన జరిగింది. ఈ మండల సమావేశంలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కోడూరు నారాయణరావు పాల్గొని మాట్లాడారు. సర్ ఓటరు జాబితా బూత్ లెవల్‌లో తప్పులుంటే సరిదిద్ది ఓటర్లు జాబితా నుంచి మాయమవ్వకుండా చూడాలన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల కోసం ఇప్పటినుంచే పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేయాలన్నారు. అనంతరం రాణిపేట గ్రామం నుంచిగుమ్మ రోడ్డు వరకు తిరంగ పతాకంతో పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ సమితి చైర్మన్ ఛిత్రి సింహాద్రి, నృసింహా చరణ్ పట్నాయక్, జెడ్పీటీసీ సభ్యురాలు (కాశీనగర్) రోక్కం రాజ్యలక్ష్మి, బాబూరావు, మండలాధ్యక్షుడు కె.జీవన్, యువజన నేత పిన్నింటి కిరణ్, దివాకర్, తదితరులు పాల్గొన్నారు.


