● క్రికెట్ మ్యాచ్‌లో వివాదం
● విద్యార్థుల మధ్య కొట్లాటకు దారితీసిన వైనం
రాయగడ: జిల్లాలోని కొలనార సమితి పరిధిలో గల రివల్‌కొన ప్రభుత్వ ఉన్నత పాఠశాల వసతి గృహంలో జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు అత్యంత దారుణంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది. క్రికెట్ మ్యాచ్ సందర్భంగా తలెత్తిన వివాదం నేపథ్యంలో తొమ్మిదో తరగతి విద్యార్థులను పదో తరగతి విద్యార్థులు కొబ్బరి మట్టలు, కర్రలతో కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతొ పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ నెల 1వ తేదీన జరిగిన క్రికెట్ మ్యాచ్ అనంతరం సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై జూనియర్ విద్యార్థులు ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేయడంతో సీనియర్లను ఉపాధ్యాయులు మందలించారు. దీంతో ఆగ్రహించిన పదో తరగతి విద్యార్థుల్లో కొందరు ఆదివారం రాత్రి తొమ్మిదో తరగతి విద్యార్థులను హాస్టల్‌పై అంతస్తులోని గదికి ఒకొక్కరిని పిలిచి అసభ్య పదజాలాలతో దూషిస్తూ కర్రలతో దాడి చేసినట్లు వీడియోలో కనిపించింది. భయంతో బాధిత విద్యార్థులు ఈ విషయాన్ని పాఠశాల నిర్వాహకులకు చెప్పకుండా దాచిపెట్టారు. ఓ విద్యార్థి ఫోన్లో ఈ ఘటనకు సంబంధించి తీసిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ కావడంతో మంగళవారం వెలుగుచూసింది. పాఠశాల హెచ్‌ఎం ప్రతాప్ చంద్ర సావుంత చందిలి పొలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడిగా గోపినాథ్ అనే మారుపేరుతో పేర్కొన్న విద్యార్థితోపాటు మరి కొందరిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. హోస్టల్ సహాయ ప్రధానోపాధ్యాయుడు డంబురుధర్ త్రిపాఠి ఈ విషయమై మాట్లాడుతూ.. ఈ ఘటనకు బాధ్యులైన విద్యార్థులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని, వారిని పాఠశాల నుంచి బహిష్కరించే ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. ఇదిలా ఉండగా ఘటనపై సమాచారం అందుకున్న కొలనార సమితి వెల్ఫేర్ ఎక్స్‌టన్స్ అధికారి దేవాశీస్ ముండా పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆసీమా రావ్ కూడా విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఈ ఘటనకు సంబంధించి వాస్తవాలను కలెక్టర్‌కు నివేదించనున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో హోస్టల్ విద్యార్థుల్లో భయాందోళన నెలకొంది. ఘటన సమయంలో హాస్టల్ భద్రత ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే అంశంతో పాటు వార్డెన్, రాత్రి గస్తీ నిర్లక్ష్యం జరిగిందా అన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతున్నట్లు తెలిసింది.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా..
ఈ ఘటనపై రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక స్పందించారు. ఆదివాసీ సంక్షేమ శాఖ కమిటీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానన్నారు. భవిష్యత్‌లో ఇటువంటి తరహా ఘటనలు ప్రభుత్వ సంక్షేమ శాఖ హాస్టళ్లల్లో జరగకుండా తగిన చర్యలు చేపట్టేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు.


