జయపురం: జయపురం రచయిత, పాత్రికేయుడు సింహాద్రి శ్రీనివాసరావు రచించిన ‘కొత్త వ్యవస్థకై ’ కవితా సంకలనాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో గల శ్రీశ్రీ కళావేదిక వారు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్, శ్రీశ్రీ కళా వేదిక జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణ్, జాతీయ ప్రణాళిక అధికారి డాక్టర్ టి.పార్థసారధి, జాతీయ కో ఆర్డినేటర్ కె.శ్రీనివాస రావు, కార్యదర్శి, విశాఖపట్నం జిల్లా శ్రీశ్రీకళా వేదిక అధ్యక్షుడు రామ్‌జగన్నాథ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ శైలా భవానీ పాల్గొని శ్రీనివాసరావు రచించిన ‘కొత్త వ్యవస్థకై ’ కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు. శ్రీనివాసరావు ప్రతిభను కొనియాడారు. పాత్రికేయుడైన శ్రీనివాసరావు సమాజంలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి, వాటిని ప్రజల హృదయాలకు ఆకట్టుకొనేలా కవితల రూపంలో పొందుపరచారని ప్రశంసించారు. ఈ కవితా సంకలనం నేటి సమాజ పరిస్థితులకు అద్దం పడుతూ.. ప్రజలను చైతన్య పరచేవిగా ఉన్నాయన్నారు. శ్రీనివాసరావు రచననలో సామాజిక స్పృహ, మానవీయ విలువలు, బాధ్యాయుతమైన ఆలోచనలు ప్రతిబింబిస్తున్నాయన్నారు. భవిష్యత్‌లో తెలుగు సాహిత్యంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాక్షించారు.


