మల్కన్‌గిరి: జిల్లాలోని కోరుకొండ సమితికి సమీపంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నలుపు రంగు టీ–షర్ట్ ధరించిన వ్యక్తి రక్తపు మడుగులో రహదారి పక్కన పడి ఉండడంతో స్థానికులు వెంటనే కోరుకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అక్కడి వైద్యుడు అభిషేక్ సాహు వైద్య పరీక్షలు నిర్వహించి సదరు వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. వెంటనే మల్కన్‌గిరి ఆదర్శ పోలీసుస్టేషన్ ఐఐసీ రీగాన్ కీండోకు సమాచారం ఇవ్వడంతో ఆయన స్వయంగా ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహం లభ్యమైన చోట ఒక ఎరుపు రంగు కారు ఉంది. దీంతో రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. అయితే ఈ యువకుడు ఎక్కడినుంచి వచ్చాడో ఎటువంటి వివరాలు లేవు. మృతదేహాన్ని మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివరాలు తెలిస్తే కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని వెల్లడించారు.


