భువనేశ్వర్: వినికిడి లోపం ఉన్న బాలికల్లో నైపుణ్యాభివృద్ధికి పదును పెట్టి ఉపాధి అవకాశాల లభ్యతను విస్తరింపజేయాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి కోరారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక రంగంతో వారిని అనుసంధానించేందుకు కృషి చేసి గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. లోక్ భవన్ అభిషేక్ హాల్‌లో వినికిడి లోపం ఉన్న బాలికలు, దివ్యాంగులతో సహా కెందుఝొర్‌లోని సేవా ఫౌండేషన్‌కు చెందిన సుమారు 50 మంది సభ్యులతో గవర్నర్ ముఖాముఖి సంభాషించారు. ఈ సందర్భంగా వినికిడి లోపం బాలికలకు టైలరింగ్, హస్తకళలలో శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రతిస్పందిస్తు రాష్ట్రంలో అనేక వస్త్ర పరిశ్రమలు రానున్నాయి. టైలరింగు రంగంలో శిక్షణ పొందిన బాలికలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించి, గౌరవప్రదమైన జీవితాలను గడిపేందుకు వీలుగా ఈ పరిశ్రమల్లో వారికి ఉపాధి అవకాశాలను అన్వేషించాలని ఆ సంస్థకు సూచించారు. వారికి అందిస్తున్న వినికిడి పరికరాలు, కృత్రిమ అవయవాలతో సహా ఇతర సహాయం గురించి కూడా గవర్నర్ పాల్గొన్న వారితో చర్చించారు. మరింత సహాయం అవసరమని గుర్తించి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమాల ద్వారా వినికిడి పరికరాల (హియరింగ్ ఎయిడ్స్) పంపిణీని సులభతరం చేయడానికి స్థానిక పరిపాలన వర్గాలను సంప్రదించాలని గవర్నర్ సూచించారు. ఈ సంభాషణ అనంతరం ఆ బృందం సభ్యులు లోక్ భవన్ ప్రాంగణంలోని ఉద్యానవనాలు, అటల్ వన్, డీర్ పార్క్‌ను సందర్శించారు. పూరీ పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లను లోక్ భవన్ చేస్తుందని గవర్నర్ వారికి హామీ ఇచ్చారు.


