పరిహారం లేదు
పొజిషన్లు ఇచ్చాం
సమస్యలతో సతమతం
● అచ్చనాపురం మీదుగా ఆఫ్‌షోర్ కాలువ ● 60 ఇళ్లలో 40 ఇళ్లవారు మాత్రమే నిర్వాసితులుగా ప్రకటన ● నేటికీ రెండిళ్లకే పరిహారం ● అయోమయంలో గిరిజనులు ● పట్టించుకోని అధికారులు
మెళియాపుట్టి:
మండలంలోని అచ్చనాపురం గిరిజన గ్రామ ప్రజలు అధికారుల చుట్టూ న్యాయం చేయాలని కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఏళ్ల గడుస్తున్నా వేదన తీరక సమస్యలతో సావాసం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. 2009వ సంవత్సరంలో ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లోనే అచ్చనాపురం గ్రామం మీదుగా కాలువ నిర్మాణం జరుగుతుందని అధికారులు అక్కడి ప్రజలకు తెలియజేశారు. అయితే కొంతకాలం క్రితం భూసేకరణకు గ్రామానికి వచ్చిన అధికారులు.. గ్రామంలో ఉన్న 60 ఇళ్లలో 40 ఇళ్లు మాత్రమే రిజర్వాయర్ కాలువ పరిధిలో ఉన్నాయని తెలిపారు. అందువలన 40 ఇళ్లు మాత్రమే తీసుకుని వాటికి పరిహారాలు అందజేస్తామన్నారు. దీంతో గిరిజనులంతా కన్నీరుమున్నీరై అధికారులకు వేడుకున్నారు. తన గ్రామాన్నంతా తీసుకోవాలని.. ఎక్కడున్నా తామంతా కలిసే ఉంటామని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అక్కడి అధికారులు పేర్కొన్నారు. అనంతరం కొన్ని రోజుల తర్వాత సవర సూరయ్య, రాధమ్మలకు ఉన్న రెండిళ్లకు సంబంధించి వారి ఖాతాలో పరిహారం పడింది. దీంతో మిగతా వాళ్లు స్థానిక తహసీల్దార్ వద్దకు వెళ్లి విషయం కనుక్కోగా 40 ఇళ్లవారిని నిర్వాసితులుగా గుర్తించామని, దానికి సంబంధించి మ్యాప్ చూపించడంతో గిరిజనులు వెనుదిరిగినట్లు తెలిపారు. కానీ కనీసం ఆ 40 ఇళ్లకు కూడా నేటికీ పరిహారం రాకపోవడంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
ఇల్లు కట్టుకోలేని దుస్థితి
కనీసం గ్రామంలో నూతన గృహ నిర్మాణాలు చేపట్టడానికి పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేయాలని గిరిజనులు కోరుతున్నారు. దీనికోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రస్తుతం ఆ భూములు తమ పరిధిలో లేవని చెబుతున్నారని వాపోతున్నారు. వేరేచోటైనా ఇల్లు నిర్మించుకోవడానికి స్థలాలు ఇవ్వాలని, భూసేకరణ చేసిన ఇళ్లకు, భూములకు పరిహారాలు అందించాలని కోరుతున్నారు. అధికారులు కనీసం తమను పట్టించుకోకపోవడంతో గ్రామానికి ఆనుకుని కాలువ పనులు చేసేటప్పుడు బ్లాస్టింగ్‌లు చేయడం వలన భయబ్రాంతులకు గురవుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు గ్రామాన్ని సందర్శించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
అధికారులు మమ్మల్ని మోసం చేస్తున్నారు. అసలు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాం. అందుకే కాలువ నిర్మాణం విష యంపై ఆర్టీఐ వేశాం. అప్పటికీ మీ గ్రామానికి సంబంధించిన రికార్డ్ మిస్ అయిందని తప్పించుకునే ప్రయత్నం చేశారు. పట్టుబడితే వివరా లు ఇచ్చారు. దాని ప్రకారం 40 ఇళ్లు భూసేకర ణ చేసినట్లు ఉంది. కానీ వాటికి సంబంధించి మాకు ఎటువంటి పరిహారాలు అందలేదు. ఇప్పటికై నా న్యాయం చేయాలి.
– కూర్మారావు, అచ్చనాపురం
ఇరిగేషన్ శాఖ వారు కాలువకు ఆనుకుని కావాల్సిన స్థలం మాత్రమే తీసుకుంటామని చెప్పారు. సేకరించిన స్థలమంతా అవసరం లేదని తెలిపారు. దీంతో ఇటీవలే గ్రామంలో కొంతమందికి పొజిషన్ సర్టిఫికెట్లు మంజూ రు చేశాం. వారికి కొన్ని సమస్యలు ఉండవచ్చు. కానీ అవి మా పరిధిలో లేవు. అచ్చనాపురం గ్రా మస్తులకు ఆ విషయాన్ని సైతం తెలియజేశాం.
– బడే పాపారావు, తహసీల్దార్,
మెళియాపుట్టి
మా గ్రామంలోని యువత సమస్యలతో సతమతమవుతున్నాం. మాపై అధికారు లు దృష్టి సారించి న్యాయం చేయాలి. ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులతో నలిగిపోతున్నాం. అధికారులు రావడం తప్పించి మేలు చేయడానికి చూడడం లేదు. మాకు యూత్ ప్యాకేజీలు ఇప్పించాలి.
– సవర బృందావతి, అచ్చనాపురం


