రాయగడ: ఒక చోరీ కేసుకు సంబంధించి ఝార్సుగుడ జిల్లా కోర్టు ఇద్దరు నిందితులకు ఆరేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. అదేవిధంగా రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. 2023 జనవరి 9వ తేదీన అర్ధరాత్రి బ్రజరాజ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి రెమోజ్ గ్రామంలో ఒక ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి నగదు, బంగారు ఆభరణాలు, బ్యాంకు పాస్‌బుక్‌లు, ఏటీఎంలు, ఆధార్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు తదితర విలువైన పత్రాలను దొంగిలించారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సురేంద్ర శెఠి, అనంత దురవాలను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ కేసును విచారించిన సీజీఎం ఇద్దరు నిందితులను దోషులుగా పరిగణించారు. నిందితులకు ఆరేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెల్లడించారు. చోరీ కేసుకు సంబంధించి సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ కుమార్ సాహు దర్యాప్తు చేయగా ఎస్పీ జీఆర్ రాఘవేంద్ర పర్యవేక్షణలో సమర్దవంతమైన దర్యాప్తు చేపట్టారు.
చర్చిలో చోరీ
● ఇద్దరు నిందితుల అరెస్టు
రాయగడ: ఝార్సుగుడ సదరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాక్స్ కాలనీలో ఉన్న సెయింట్ ఆర్నాల్డ్స్ కేథలిక్ చర్చిలో జరిగిన చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈనెల 14, 15వ తేదీ అర్ధరాత్రి మధ్య గుర్తు తెలియని దుండగులు చర్చి ప్రాంగణంలోకి చొరబడి విరాళాల పెట్టెలను పగులగొట్టి రూ.12 వేల నగదు అపహరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. అరైస్టెనవారిలో దీపక్ కుమార్, అమన్ సింగ్‌లు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు దీపక్ కుమార్ నుంచి చోరీకి సంబంధించిన నీలం రంగు ఇనుప కట్టర్‌ను స్వాధీనం చేసుకోగా, అమన్ సింగ్ నుంచి దొంగిలించిన నగదులో రూ.3 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ జీఆర్ రాఘవేంద్ర పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేశారు.


