దక్షిణ మలుపు తిరిగిన దేవీ సుభద్ర రథం | - | Sakshi
Sakshi News home page

దక్షిణ మలుపు తిరిగిన దేవీ సుభద్ర రథం

Jul 22 2026 2:29 AM | Updated on Jul 22 2026 2:29 AM

దక్షిణ మలుపు తిరిగిన దేవీ సుభద్ర రథం

తాళధ్వజం, నంది ఘోష్‌ రథాల మలుపు వాయిదా

భువనేశ్వర్‌:

ఏడాది రథయాత్రలో అడుగడుగున వర్షం అడ్డంకులు సృష్టిస్తోంది. పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష అష్టమి తిథి పురస్కరించుకుని మారు రథయాత్ర కోసం రథాలను సిద్ధం చేసేందుకు దక్షిణ దిశ వైపు మలుపు తిప్పడం ఆచారం. హేరా పంచమి పురస్కరించుకుని విరహ వేదన తాళలేక మహాలక్ష్మి దేవి శ్రీమందిరం నుంచి రత్న శోభిత పల్లకిలో శ్రీగుండిచా మందిరానికి వెళ్లినా, ప్రియనాథుని దర్శనం కలగకపోవడంతో తీవ్ర మనస్తాపంతో వెనుదిరిగి జగన్నాథుని నందిఘోష్‌ రథాన్ని చీల్చి చెండాడుతుంది. ప్రియసఖి ఆవేదనకు స్పందించిన జగన్నాథుడు తక్షణమే మర్నాడు మారుయాత్ర కోసం ఆజ్ఞాపించడం విశేషం. అందుకు సంకేంతంగా 3 ఆజ్ఞామాలలు గుండిచా మందిరం ఆవరణ శారదా బాలి ప్రాంగణంలో నిలిచి ఉన్న రథాల ప్రాంగణానికి చేరడంతో యాత్రకు అనుకూలంగా శ్రీమందిరానికి అభిముఖంగా మలుపు తిప్పేందుకు చేసిన సన్నాహం దక్షిణ మోడ్‌గా పేర్కొంటారు.

కుండపోత వర్షం

ఆలయ ఆచారాల ప్రకారం మంగళవారం 3 రథాలను దక్షిణ దిశవైపు మలుపు తిప్పేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. ఆజ్ఞామాలలు చేరడంతో తొలుత దేవీ సుభద్ర రథం దర్ప దళణ్‌ మలుపు తిప్పడం ప్రారంభించారు. వెంబడి బలభద్ర స్వామి తాళధ్వజం మలుపు తిప్పడం ఆరంభించారు. ఇంతలో వాన కుండపోతగా కురవడంతో రథాలు మలుపు తిప్పే కార్యక్రమాన్ని వాయిదా వేయడం అనివార్యంగా పరిగణించి నిలిపివేశారు. దీంతో బలభద్ర స్వామి రథం తాళధ్వజం, జగన్నాథుని రథం నందిఘోష్‌ రథాలను బుధవారం మలుపు తిప్పి దక్షిణ మోడ్‌ ఘట్టం పూర్తి చేస్తామని శ్రీమందిరం ప్రధాన నిర్వాహకుడు డాక్టర్‌ అరవింద కుమార్‌ పాఢి తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా తాళధ్వజం మలుపు తిప్పడం అర్ధాంతరంగా నిలిచిపోయింది. ప్రస్తుత ప్రదేశంలోనే రథాన్ని నిలిపివేశారు. అక్కడ నుంచి రేపు నందిఘోష రథంతో పాటు శారదా బాలి వైపు లాగుతారు. ఆలయ పరిపాలన, భద్రతా దళాలు ప్రస్తుత ప్రదేశంలో అన్ని రథాలకు అవసరమైన బారికేడింగ్‌, భద్రతా ఏర్పాట్లు చేశాయని సీఏవో వివరించారు. మరోవైపు రథాలు మార్గ మధ్యంలో నిలిచిపోయినందున బొడొ దండొలో సాధారణ రవాణాకు అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.

దక్షిణం

వైపు దేవీ సుభద్ర రథం తిప్పుతున్న జవానులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement