జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితిలో సివిల్ సప్లయ్ సహాయకులు వివిధ డిమాండ్లతో సామూహిక సెలవు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు సివిల్ సప్లయ్ సహాయకుల సంఘం ద్వారా ఎంతో కాలంగా న్యాయపరమైన డిమాండ్లను సంబంధిత అధికారులకు వివరిస్తూ. వాటిని పరిష్కరించాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని వారి ప్రధాన ఆరోపణ. సామూహిక సెలవులు తీసుకొని నిరసన తెలుపననున్నామని, తమ డిమాండ్లు నెరవేరేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పస్టం చేశారు. సంఘ నేతలు బొయిపరిగుడ బీడీఓకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. బొయిపరిగుడ సమితిలో గ్రామీణ ప్రజలకు ఇచ్చే రేషన్ పంపిణీపై తీవ్ర ప్రభావం పడవచ్చని, సివిల్ సప్లయ్ విభాగంలో పలు పనులపై ప్రభావం పడుతుందని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.
దొంగ దొరికాడు
పర్లాకిమిడి: పట్టణంలో గత కొంత కాలంగా పీహెచ్‌డీ నీటి మీటర్లు దొంగిలిస్తున్న దొంగను ఆదర్శ పోలీసు స్టేషన్ అధికారులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. వివిధ మీడియాల్లో ప్రచారం మేరకు ప్రజారోగ్యశాఖ ఇచ్చిన ఫిర్యాదును ఆధారం చేసుకుని సీసీ టీవీ ఫ్యూటేజ్, స్థానికంగా విచారణ, కొంతమంది ఇచ్చిన సమాచారం మేరకు 9వ వార్డు గజేంద్రవీధికి చెందిన తాడుతూరి విష్ణు (27)ను అరెస్టు చేశారు. పి.డి.పి.పి.చట్టం (పబ్లిక్ ప్రాపెర్టీ డ్యామేజి)పై కేసు పెట్టారు. నిందితుడి వద్ద 15 వాటర్ మీటర్లు, వినియోగించిన సుత్తిని స్వాధీనం చేసుకున్నారు. నీటి మీటర్లు ఖరీదు ఒక్కొక్కటీ రూ.7వేలు ఉంటుంది. ప్రభుత్వం వాటిని తాగునీటి వినియోగదారుల వద్ద వాయిదాల పద్ధతిపై కట్టించుకుంది. నీటి మీటర్లను నిందితుడు చోరీ చేసి అందులో ఉన్న ఇత్తడిని తొలగించి స్క్రాప్ క్రింద అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తెలియజేశాడు. ఒక్కొక్క నీటి మీటర్ నుంచి 500 గ్రాములు, 800 మీటర్లు వరకు ఇత్తడి లభిస్తుంది. 2025 నుంచి వరుసగా రోడ్డు పక్క, పలువీధుల్లో రాత్రిళ్లు వాటర్ మీటర్లు దొంగతనానికి పాల్పడి, వాటిని ముక్కలుచేసి అందులో ఉన్న ఇత్తడిని అమ్ముతున్నట్టు నిందితుడు అంగీకరించినట్లు పోలీసు ఐఐసీ ప్రశాంత భూపతి తెలియజేశారు. వాటర్ మీటర్లు పలువురి వినియోగదారుల ఇళ్ల నుంచి చోరీ జరుగటంతో అధిక ఆర్థిక నష్టం వారికి సంభంవించిదని ఐఐసీ తెలియజేశారు. ఇప్పటివరకు చోరీ జరిగిన మీటర్లను కూడా స్వాధీనం చేసుకుంటామని పోలీసులు తెలియజేశారు.
రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ మహేంద్ర ఆశ్రమ విద్యాలయం పదో తరగతి విద్యార్థిని అర్పితా నాయక్‌కు రాష్ట్ర స్థాయిలో జరిగిన ప్రబంధాల పోటీల్లో ప్రథమ స్థానం సాధించినట్టు ప్రధాన ఉపాధ్యాయులు ప్రకాష్ జెన్నా సోమవారం తెలిపారు. గత నెలలో జిల్లా స్థాయిలో ఒడిశా సాహిత్య అకాడమీ స్వర్ణక్షేత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వక్తృత్వం, కవితా పఠనం, ప్రబంధాలు, జనరల్ నాలెడ్డ్ పోటీల్లో కొంతమంది రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. వీరిలో రాయఘడ బ్లాక్‌కు చెందిన అర్పితానాయక్ రాష్ట్ర స్థాయికి ఎంపికై ంది. ఈ నెల 25న భువనేశ్వర్‌లో రవీంద్ర మండపంలో సత్కారం పొందనున్నట్టు జిల్లా శిక్షా అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సంస్కృతి పరిషత్ అధికారి అర్చనా మంగరాజ్ అభినందనలు తెలిపారు.


