నీటిగుంతలో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

నీటిగుంతలో మహిళ మృతి

Jul 19 2026 2:20 AM | Updated on Jul 19 2026 2:20 AM

మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి బడిగెట పంచాయతీలో శుక్రవారం సాయంత్రం స్నానానికి వెళ్లిన మహిళ నీటిగుంతలో మునిగి దురదృష్టావశాత్తు మరణించింది. వివరాల్లోకి వెళ్తే.. ఉదయం ఇర్మా పడియమి అనే వ్యక్తి తన భార్య ముకే పడియమి(35)తో పొలం పనులకు వెళ్లాడు. అనంతరం సాయంత్రం ఇద్దరూ ఇంటికి వచ్చాక ముకే పడియామి స్నానం కోసం బావి తరహా నీటిగుంత వద్దకు వెళ్లింది. అక్కడ నీటిలో కాలుజారి పడిపోయి బయటకు రాలేకపోయింది. అయితే ఎంతసేపటికీ భార్య ఇంటికి రాకపోవడంతో భర్త ఇర్మా గ్రామంలో వెదికాడు. అయితే శనివారం ఉదయం స్థానికులు మృతదేహాన్ని బావిలో గమనించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐఐసీ ప్రభుదత్తు బిశ్వల్‌ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మృతదేహన్ని భర్తకు అప్పగించారు.

గంజాయి స్వాఽధీనం

రాయగడ: రాయడ నుంచి రైలుమార్గం ద్వారా ఛత్తీస్‌ఘడ్‌లోని రాయిపూర్‌కు గంజాయిని అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని రైల్వే పోలీసులు అడ్డుకున్నారు. రైల్వేస్టేషన్‌లో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, ఒకరిని అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితుడు జిల్లాలోని బిసంకటక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి సికబంధ గ్రామానికి చెందిన ధర్మిత్‌ భత్రగా గుర్తించారు. అతడిని కోర్టుకు తరలించారు. దాడిలో జీఆర్పీ ఇన్‌స్పెక్టర్‌ వినయ్‌ కుమార్‌ మింజా, ఎస్‌ఐ సంతోష్‌ కుమార్‌ పరిడ, ఏఎస్‌ఐ మానిక్‌ చంద్రగౌడో, కానిస్టేబుల్‌ చిత్తరంజన్‌ స్వయిన్‌, రమేష్‌ కందపాణి తదితరులు పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన సదస్సు

పర్లాకిమిడి: గుమ్మాబ్లాక్‌ వృషభ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం వివిధ చట్టాలపై న్యాయ అవగాహన సదస్సును జిల్లా జడ్జి జగదీష్‌ ప్రసాద్‌ మహంతి ఆదేశాల మేరకు జిల్లా న్యాయసేవా ప్రాధికరణ కార్యదర్శి బిమల్‌ రవుళో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కేసుల్లో సంచలన తీర్పులను చర్చించారు. కార్యక్రమంలో సీనియర్‌ పీపీ రాజేష్‌ కుమార్‌ మిశ్రా, సైకాలజీ స్పెషలిస్టు ప్రాణరంజన్‌ నాయక్‌, సెరంగో పోలీసుస్టేషన్‌ ఎస్‌ఐ చౌదురి శివ, సామాజిక కార్యకర్త దయా పలక తదితరులు పాల్గొన్నారు.

ఉచితంగానే క్యాన్సర్‌ చికిత్స

భువనేశ్వర్‌: రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద 121 కొత్త క్యాన్సర్‌ చికిత్స ప్యాకేజీలను చేర్చాలని నిర్ణయించింది. దీనితో అర్హులైన లబ్ధిదారులకు ఉచిత చికిత్స పొందే అవకాశం గణనీయంగా విస్తరించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ ముఖేష్‌ మహాలింగ్‌ మాట్లాడుతూ.. క్యాన్సర్‌ చికిత్స సౌకర్యాలను బలోపేతం చేసి రోగులు, వారి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడం కొత్తగా ఆమోదించిన ప్యాకేజీల లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ విస్తరించిన కవరేజీలో కీమో థెరపీ, రేడియో థెరపీ, అనేక రకాల సంక్లిష్ట క్యాన్సర్‌ శస్త్ర చికిత్సలు చేర్చారు. దీనివల్ల బాధితులకు అధిక ఖర్చుల భారం లేకుండా అధునాతన చికిత్సను పొందగలుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అదనపు చికిత్స ప్యాకేజీల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. తద్వారా ఆర్థిక ఇబ్బందుల కారణంగా రోగులు చికిత్సను అర్ధాంతరంగా ఆపకుండా చూస్తామని మంత్రి తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన ఏ రోగికి కూడా సకాలంలో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందకుండా పోకూడదనే ప్రభుత్వ నిబద్ధతకు ఈ చొరవ నిదర్శనమన్నారు. విస్తరించిన కవరేజీ కింద ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుదారులు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు, ఎంప్యానెల్డ్‌ ప్రైవేట్‌ ఆరోగ్య సంరక్షణ సంస్థలలో కూడా కొత్త క్యాన్సర్‌ చికిత్స ప్యాకేజీలను పొందగలుగుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement