భువనేశ్వర్: జగన్నాథుని రథయాత్ర కీలక దశ శనివారం ఆరంభమైంది. స్వామివారు గుండిచా మందిరం అడప మండపంపై కొలువుదీరడం యాత్ర ప్రధాన ఆకర్షణ. ఈ మండపంపై శ్రీమందిరం రత్న వేదికపై నిత్యం అందుకునే సేవాదులు, అలంకరణలతో స్వామివారు భక్త జనులకు దర్శనం ప్రసాదిస్తాడు. అడప మండపంపై స్వామి దర్శనం పూర్వ జన్మ సుకృతంగా భక్తులు భావిస్తారు. రథాలపై వేంచేసిన మూల విరాటులు గుండిచా మందిరం ఆవరణ శారదా బాలి ప్రాంగణంలో ఆరుబయట గత 3 రోజులుగా రాత్రింబవళ్లు సర్వ జనులకు కనులనిండా దర్శనం కల్పించారు. శనివారం సాయంత్రం రథాల పైనుంచి దిగి అడప మండపానికి చేరారు. రథాలకు అమర్చిన కొయ్య గుర్రాల్ని తొలగించి, రథాలకు చారుమళ్లు అమర్చి మూల విరాటులను సురక్షితంగా కిందకు దించారు. మందిరంలోకి ప్రవేశింపజేసే పొహండి బృహత్తర ప్రక్రియ విజయవంతంగా ముగిసింది.


