కొరాపుట్: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిత్యానంద గొండో రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష బీజేడీ భారీ ఆందోళన చేపట్టింది. శనివారం కొరాపుట్ జిల్లా కేంద్రంలో అవిభక్త కొరాపుట్ జిల్లాల నుంచి తరలివచ్చిన బీజేడీ పార్టీ విద్యార్థి, యువజన, మహిళ విభాగాలు ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. కలక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టి బహిరంగ సభ నిర్వహించారు. పార్టీ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు ఇప్సితా సాహు మాట్లాడుతూ విద్యామంత్రిని దుయ్యబట్టారు. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వం ముద్రించిన పాఠ్య పుస్తకాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వానికి వందల కోట్ల నష్టం వచ్చిందన్నారు. విద్యామంత్రి సుమారు 40 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు వస్తున్న వార్తలపై దర్యాప్తు చేయాలని కోరారు. ఈ కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఎం మెహన్ చరణ్ మజ్జి, నిత్యానంద గొండొ చిత్రపటాలకు ఎండు చేపలు బహుకరించారు. నెయ్యి వేసి దగ్ధం చేశారు. ఆందోళనలో మాజీ మంత్రి రబినారాయణ నందో, కేసీసీ బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వర్ చంద్ర పాణిగ్రాహి, కొరాపుట్ జెడ్పీ చైర్‌పర్సన్ సస్మితా మెలక, మాజీ ఎంపీ జిన్ను హిక్కా, మాజీ ఎమ్మెల్యే రఘురాం పొడాల్, అరుణ్ కుమార్ మిశ్ర, ఈశ్వర్ అల్లాడ, లలెటెందు విద్యాదర్ శెఠి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.


