పర్లాకిమిడి: పర్లాకిమిడి పురపాలక సంఘం 2026–27 బడ్జెట్ సమావేశాలు మున్సిపల్ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం జరిగాయి. సమావేశానికి పురపాలక సంఘం చైర్మన్ నిర్మల శెఠి అధ్యక్షత వహించగా, గౌరవ అతిథిగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, వైస్ చైర్మన్ లెంకమధు, ఎగ్జిక్యూటివ్ అధికారి లక్ష్మణ ముర్ము, ఇంజినీర్లు, కౌన్సిలర్లు హాజరయ్యారు. కౌన్సిలర్లు యాక్షన్ ప్లాన్ ఇవ్వాలని చైర్మన్ నిర్మలా శెఠి కోరారు. అలాగే వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు, ముక్తా పథకం, వీధి లైట్లు, పాఠశాలల మరామతులపై నివేదిక ఇవ్వాలన్నారు. అలాగే ఆర్థిక సంవంత్సరంలో గృహాలు, వ్యాపార సమూదాయాల ప్రాపర్టీ, హోల్డింగ్ ట్యాక్సులు, కలెక్షన్ కూడా లక్ష్యాలు చేరుకోవాలని ట్యాక్స్ కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ చేశారు. కౌన్సిలర్లు బబునా బెహారా, అమ్ములమ్మ, బబునా బెహారా, నారాయణరావు బెహారా ఉన్నారు.
నిత్యావసర సరుకులు పంపిణీ
రాయగడ: స్థానిక రైతుల కాలనీలో నవజీవన్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం నిరుపేదలైన 40 మంది వృద్ధ ఆదివాసీ మహిళలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ట్రస్టు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతీనెల ఇటువంటి తరహా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ట్రస్టు నిర్వాహకురాలు ఎం.నళిని తెలియజేశారు. తిరుపతికి చెందిన డాక్టర్ శ్రీధర్ ఆచార్యులు ఇక్కడ ట్రస్టుని ఏర్పాటు చేసి నిరుపేదలకు అండగా నిలుస్తున్నారన్నారు. ప్రతినెలా ఆదివాసీలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడంతో పాటు ట్రస్టు ద్వారా అనాథ, పేద ఆదివాసీ యువతులకు ఉచితంగా చదివించడంతో పాటు వారికి భోజన, వసతి సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు. సుమారు వంద మందికిపైగా ఆదివాసీ యువతులు ట్రస్టు ద్వారా ఈ సౌకర్యాలు పొందుతున్నారని వెల్లడించారు.
మెట్రో రైలు ప్రాజెక్టుపై పునఃపరిశీలించాలి
భువనేశ్వర్: భువనేశ్వర్ మెట్రో రైలు ప్రాజెక్టును నిలిపివేస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని భువనేశ్వర్ లోక్‌సభ సభ్యురాలు అపరాజిత షడంగి రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు ప్రకటించారు. ప్రాజెక్టును మూసివేయడానికి పేర్కొన్న కొన్ని కారణాలు, వాస్తవ అవసరాల వాస్తవిక విశ్లేషణపై ఆధారపడినట్లు కనిపించడం లేదని లేఖలో వివరించారు. విస్తృతంగా పట్టణీకరణ చెందుతున్న రాజధాని ప్రాంతానికి మెట్రో రైలు ప్రాజెక్టు ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశంగా పేర్కొన్నారు.


