23 ఏళ్లుగా సా..గుతున్న ఓ కేసులో బిలీయనీర్ ముఖేష్ అంబానీకి ఊరట లభించింది. కేసును కొట్టిపారేసిన న్యాయస్థానం.. ఫిర్యాదు చేసిన వ్యక్తికే జరిమానా విధించి షాకిచ్చింది. ఈ క్రమంలో అంబానీకి సమన్లు జారీ చేసిన కింది కోర్టు తీరును ఒడిశా హైకోర్టు తప్పుబట్టింది. రూ.501 ఈ వ్యవహారంలో అసలేం జరిగిందంటే..
ఒడిశా రూర్కెలాకు చెందిన ప్రఫుల్ కుమార్ మిశ్రా అనే వ్యక్తి 2003లో.. ఆనాడు ముఖేష్ అంబానీ అధినేతగా ఉన్న రిలయన్స్ ఇన్ఫోకమ్(రిలయన్స్ గ్రూప్‌లో భాగంగా..) తీసుకొచ్చిన ఓ స్కీమ్‌లో చేరాడు. సబ్సిడీ కింద రూ.501 చెల్లించి ఫోన్‌ను కొనుగోలు చేశాడు. అయితే ఆ సేవలు నాసిరకంగా ఉన్నాయని.. తాను ఎంతో నష్టపోయానని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యవహారంలో ముఖేష్ అంబానీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరాడు.
అయితే.. ఈ వ్యవహారంలో అతను కోర్టులను పదే పదే ఆశ్రయించాడు. 2003, 2004లో వేసిన పిటిషన్లను 2004, 2005లో నిశితంగా పరిశీలించిన ఒడిశా హైకోర్టు కొట్టి పారేసింది. 2007లో అయితే ఏకంగా సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు వేస్తే.. అక్కడా అతనికి చుక్కెదురైంది.
నాలుగోసారి హైకోర్టును ఆశ్రయించగా.. ఈసారి న్యాయస్థానం పిటిషన్‌ను పరిశీలించి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు దశాబ్దాలుగా పిటిషన్లు వేస్తూ కోర్టుల సమయాన్ని వృథా చేశారంటూ.. రూ.1000 జరిమానా విధించింది. మార్చి 31న తీర్పు వెలువడగా.. తాజాగా ఆ ఆర్డర్ కాపీని ఆన్‌లైన్‌లో పబ్లిష్ చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.
న్యాయ పరిశీలన చేయరా?..
సాధారణంగా మొబైల్ సేవలపై వినియోగదారుడు ఫిర్యాదు చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అదీ సంబంధిత ఫోరమ్‌లలో. కానీ, ఈ కేసులో ప్రఫుల్.. ఏకంగా క్రిమినల్ కేసు పెట్టాలంటూ కోర్టులను ఆశ్రయించాడు. అయితే అతని పిటిషన్ ఆధారంగా.. పాన్‌పోష్‌లోని సబ్-డివిజనల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ (SDJM) ముఖేష్ అంబానీకి సమన్లు కూడా జారీ చేసింది. ఈ పరిణామాలన్నింటిపై తాజా విచారణలో.. ఒడిశా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘‘చిన్న మొత్తానికి సంబంధించిన వినియోగదారుడి ఫిర్యాదుతో.. ఓ పేరొందిన వ్యాపారవేత్తను నిందితుడిగా పేర్కొనడం ఏంటి?.. సమన్లు జారీ చేయడం ఏంటి?. ఇది కచ్చితంగా సరైన న్యాయ పరిశీలన లేకుండా జరిగిన వ్యవహారమేనని స్పష్టమవుతోంది’’ అని కింది కోర్టును మందలించింది. ఈ కేసులో అంబానీకి జారీ చేసిన సమన్లు, అలాగే ఈ పెండింగ్ కేసును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
అలాంటి హక్కు ఉండదు..
మొబైల్ సేవల్లో అంతరాయం ఏర్పడితే వినియోగదారుడికి ఫిర్యాదు చేసే హక్కు ఉండి ఉండొచ్చు. కానీ అలాంటి వివాదాలను క్రిమినల్ చట్టం ద్వారా కొనసాగించడం తగదు. “ఫిర్యాదు ఎలాంటిదైనా.. అది క్రిమినల్ బాధ్యత లేని వారిపై క్రిమినల్ చట్టాన్ని ఆయుధంగా వాడుకునే హక్కు ఇవ్వదు” అని తీర్పు సందర్భంగా జస్టిస్ పాణిగ్రాహి వ్యాఖ్యానించారు.


