petition quashed
-
ముఖేష్ అంబానీకి ఊరట
23 ఏళ్లుగా సా..గుతున్న ఓ కేసులో బిలీయనీర్ ముఖేష్ అంబానీకి ఊరట లభించింది. కేసును కొట్టిపారేసిన న్యాయస్థానం.. ఫిర్యాదు చేసిన వ్యక్తికే జరిమానా విధించి షాకిచ్చింది. ఈ క్రమంలో అంబానీకి సమన్లు జారీ చేసిన కింది కోర్టు తీరును ఒడిశా హైకోర్టు తప్పుబట్టింది. రూ.501 ఈ వ్యవహారంలో అసలేం జరిగిందంటే.. ఒడిశా రూర్కెలాకు చెందిన ప్రఫుల్ కుమార్ మిశ్రా అనే వ్యక్తి 2003లో.. ఆనాడు ముఖేష్ అంబానీ అధినేతగా ఉన్న రిలయన్స్ ఇన్ఫోకమ్(రిలయన్స్ గ్రూప్‌లో భాగంగా..) తీసుకొచ్చిన ఓ స్కీమ్‌లో చేరాడు. సబ్సిడీ కింద రూ.501 చెల్లించి ఫోన్‌ను కొనుగోలు చేశాడు. అయితే ఆ సేవలు నాసిరకంగా ఉన్నాయని.. తాను ఎంతో నష్టపోయానని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యవహారంలో ముఖేష్ అంబానీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరాడు.అయితే.. ఈ వ్యవహారంలో అతను కోర్టులను పదే పదే ఆశ్రయించాడు. 2003, 2004లో వేసిన పిటిషన్లను 2004, 2005లో నిశితంగా పరిశీలించిన ఒడిశా హైకోర్టు కొట్టి పారేసింది. 2007లో అయితే ఏకంగా సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు వేస్తే.. అక్కడా అతనికి చుక్కెదురైంది.నాలుగోసారి హైకోర్టును ఆశ్రయించగా.. ఈసారి న్యాయస్థానం పిటిషన్‌ను పరిశీలించి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు దశాబ్దాలుగా పిటిషన్లు వేస్తూ కోర్టుల సమయాన్ని వృథా చేశారంటూ.. రూ.1000 జరిమానా విధించింది. మార్చి 31న తీర్పు వెలువడగా.. తాజాగా ఆ ఆర్డర్ కాపీని ఆన్లైన్లో పబ్లిష్ చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.న్యాయ పరిశీలన చేయరా?..సాధారణంగా మొబైల్ సేవలపై వినియోగదారుడు ఫిర్యాదు చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అదీ సంబంధిత ఫోరమ్‌లలో. కానీ, ఈ కేసులో ప్రఫుల్.. ఏకంగా క్రిమినల్ కేసు పెట్టాలంటూ కోర్టులను ఆశ్రయించాడు. అయితే అతని పిటిషన్ ఆధారంగా.. పాన్పోష్లోని సబ్-డివిజనల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ (SDJM) ముఖేష్ అంబానీకి సమన్లు కూడా జారీ చేసింది. ఈ పరిణామాలన్నింటిపై తాజా విచారణలో.. ఒడిశా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘చిన్న మొత్తానికి సంబంధించిన వినియోగదారుడి ఫిర్యాదుతో.. ఓ పేరొందిన వ్యాపారవేత్తను నిందితుడిగా పేర్కొనడం ఏంటి?.. సమన్లు జారీ చేయడం ఏంటి?. ఇది కచ్చితంగా సరైన న్యాయ పరిశీలన లేకుండా జరిగిన వ్యవహారమేనని స్పష్టమవుతోంది’’ అని కింది కోర్టును మందలించింది. ఈ కేసులో అంబానీకి జారీ చేసిన సమన్లు, అలాగే ఈ పెండింగ్ కేసును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.అలాంటి హక్కు ఉండదు.. మొబైల్ సేవల్లో అంతరాయం ఏర్పడితే వినియోగదారుడికి ఫిర్యాదు చేసే హక్కు ఉండి ఉండొచ్చు. కానీ అలాంటి వివాదాలను క్రిమినల్ చట్టం ద్వారా కొనసాగించడం తగదు. “ఫిర్యాదు ఎలాంటిదైనా.. అది క్రిమినల్ బాధ్యత లేని వారిపై క్రిమినల్ చట్టాన్ని ఆయుధంగా వాడుకునే హక్కు ఇవ్వదు” అని తీర్పు సందర్భంగా జస్టిస్ పాణిగ్రాహి వ్యాఖ్యానించారు. -
ఏసీబీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు
రేవంత్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుల నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారని, సీఆర్పీసీ సెక్షన్ 164 కింద కేసు విచారణ పూర్తి చేశారని కోర్టు భావించింది. ఇప్పుడు మళ్లీ కస్టడీకి తీసుకుని ఏం విచారిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రధాన నిందితుడు కేసును ప్రభావితం చేస్తాడని ఏసీబీ వాదించినా, ఆ వాదనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ మీద జోక్యం చేసుకోడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. (చదవండి- రేవంత్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ ప్రారంభం) ఏసీబీ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులో పలు లోపాలు ఉన్నాయని సిబల్ అన్నారు. కానీ, ఆయన వాదనతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. భోస్లే ఏకీభవించలేదు. ఇప్పటికే నెల రోజుల పాటు రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నారని అన్నారు. విచారణ పూర్తయినందున ఇక ఆయన బెయిల్ రద్దుచేయాల్సిన అవసరం లేదని భావించారు. కాగా, బెయిల్ షరతులను రేవంత్ ఉల్లంఘించారని, జైలు నుంచి విడుదలైన సమయంలోనే బెదిరింపు ధోరణిలో ముఖ్యమంత్రిపై మాట్లాడారని న్యాయవాదులు అంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తిరస్కరించడంతో ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని, మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది.


