జయపురం: పట్టణంలోని ప్రభుత్వ మహిళా కళాశాల 40వ వార్షికోత్సవాన్ని గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడి విద్యార్థినులు సాంప్రదాయ గౌరవాన్ని కాపాడుతూ చదువులో కళాశాలకు మంచి గుర్తింపు తెస్తున్నట్లు కొనియాడారు. అనంతరం విద్యార్థినుల సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో విజేతలకు బహు మతులు ప్రదానం చేశారు. ప్రిన్సిపాల్ వివేకానంద సున అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విక్రమదేవ్ విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ మహేశ్వర్ చంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్‌స్టేషన్ తనిఖీ
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర పోలీస్‌స్టేషన్‌ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాయంత్రం స్టేషన్‌లో వివిధ గదులు పరిశీలించారు. రికార్డులు, నిందితుల సెల్, వసతులు, కక్షిదారుల ప్రాంతం తదితర అంశాలు క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. హైకోర్టు నిబంధనలు ప్రకారం ఈ పరిశీలన జరిగింది. ఈ సమయంలో ఐఐసీ సంబిత్ బెహరా కలెక్టర్‌కి స్టేషన్ వివరాలు తెలియజేశారు.
చోరీ కేసులో నిందితుడు అరెస్టు
కొరాపుట్: ఒక ఇంట్లో దొంగతనం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర పోలీస్‌స్టేషన్ ఐఐసీ సంబిత్ బెహరా ఈ కేసు వివరాలు ప్రకటించారు. పట్టణంలోని ఆర్‌కే కాలనీలో నివాసం ఉంటున్న ప్రియాంక పాత్రో నివాసంలో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో 6 ఆభరణాలు, రూ.10 వేల నగదు, ఒక చేతి గడియారం చోరీకి గురయ్యాయి. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా పట్టణంలోని తొట్టా వీధికి చెందిన రోమ్యా అలియస్ రొణ్య ఖొరఖొర దొంగతనం చేసినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి జైలుకి తరలించినట్లు పోలీసులు ప్రకటించారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడు దుర్మరణం
● ఇద్దరికి గాయాలు
రాయగడ: జిల్లాలోని మునిగుడ పోలీస్ స్టేషన్ పరిధి లిటిగుడ కూడలి వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయాలపాలయ్యారు. మృతుడు కలహండి జిల్లాలోని కలమ్‌పూర్ ప్రాంతానికి చెందిన కేశవ సాహు (34) కాగా గాయపడిన వారు మురిబహాల్ ప్రాంతానికి చెందిన ప్రమోద్ సాహు, కేదారనాథ్ సాహులుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న మునిగుడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం మునిగుడ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆంబులెన్స్‌లో మునిగుడ ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. కలహండి జిల్లాకు చెందిన కేశవ, ప్రమోద్, కేదార్‌నాథ్‌లు ఒకే బైక్‌పై మునిగుడకు వస్తుండగా లిటిగుడ కూడలి వద్ద ఎదురుగా వస్తున్న మరో బైకును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. వీరిలో కేశవ సంఘటనా స్థలం వద్దే ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


