జయపురం: రాయగడ జిల్లా కాశీపూర్ సమితిలో కంటిమాల గ్రామాన్ని పోలీసులు చుట్టిముట్టి టియర్ గ్యాస్ ప్రయోగం చేయడమే కాకుండా, లాఠీచార్జి చేయడంపై కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ గ్రామం నుంచి ప్రజలను పంపించేందుకు పాలకులు, పోలీసులు కుట్ర పన్నారని మండిపడ్డారు. ఈ మేరకు జయపురంలో నిరసన ర్యాలీ శుక్రవారం చేపట్టారు. కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రమోద్ కుమార్ మహంతి మాట్లాడుతూ.. ఆ ప్రాంతంలో వేదాంత అల్యూమిన కంపెనీకి రహదారి నిర్మాణం కోసం ప్రభుత్వం అత్యుత్సాహం చూపుతోందని ఆరోపించారు. కావాల్సిన భూసేకరణ కోసం గ్రామసభ నిర్వహించలేదని మండిపడ్డారు. ఆ ప్రాంతం షెడ్యూల్ ఏరియా కావడంతో పాటు ఐదో షెడ్యూల్ పరిధిలోకి వస్తుందని గుర్తు చేస్తూ వెంటనే రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకొని పోలీసు శిబిరాలను తొలగించాలని డిమాండ్ చేశారు. నిరసనలో జిల్లా కమ్యూనిస్టు పార్టీ మాజీ కార్యదర్శి జుధిష్టర్ రౌళో, జిల్లా కార్యదర్శి రామకృష్ణ దాస్, సహాయ కార్యదర్శి బుద్ర బడనాయిక్, యువనేత నంద హరిజన్, విద్యార్థి నాయకుడు కృష్ణ ఖొర తదితరులు పాల్గొన్నారు.


