● ఒడిశా గ్రిడ్ ఆధునీకరణతో 22 లక్షల మందికి ప్రయోజనం
● గ్రిడ్ సబ్‌స్టేషన్ల ప్రారంభోత్సవంలో సీఎం మోహన్‌చరణ్ మాఝి
భువనేశ్వర్: ప్రపంచ శ్రేణి విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసి వినియోగదారులకు అధిక నాణ్యత, నికరమైన, నిలకడ విద్యుత్‌ను నిరంతరాయం సరఫరా చేయడం లక్ష్యమని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలిపారు. ఖుర్దా జిల్లా బలియంత, సత్యనగర్, కటక్‌లోని ఎస్‌సీబీ వైద్య బోధన ఆస్పత్రి వద్ద ఉన్న 3 అత్యాధునిక జీఐఎస్ గ్రిడ్ సబ్‌స్టేషన్లతో పాటు, ఓపీటీసీఎల్ 8 ప్రధాన ట్రాన్స్‌మిషన్ లైన్లను ముఖ్యమంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రాష్ట్ర రాజధానిలో నిరంతరాయంగా అధిక నాణ్యత, నమ్మకమైన విద్యుత్ సరఫరాకు ఈ వ్యవస్థ దోహదపడుతుందన్నారు. పరిశ్రమలు, వ్యాపారం, సాంకేతిక సమాచారం, పట్టణ జీవనం సమగ్ర అభివృద్ధిని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు. ఒడిశా గ్రిడ్ ఆధునీకరణ 22 లక్షల మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చుతుందని విద్యుత్ శాఖ బాధ్యతలు వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్ తెలిపారు. దాదాపు రూ. 600 కోట్ల భారీ పెట్టుబడితో ఏడాదిలోపే ఈ ప్రాజెక్టులు పూర్తి కావడం పట్ల మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. దీంతో భువనేశ్వర్, సమీప ప్రాంతాలలోని సుమారు 22 లక్షల మంది వినియోగదారులకు నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరా సుసాధ్యం అయ్యింన్నారు. చట్టపరమైన, అధికారిక పాలనాపరమైన అడ్డంకుల కారణంగా ఈ ప్రాజెక్టులు సంవత్సరాల తరబడి ఆలస్యం కావడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కొత్త సబ్‌స్టేషన్లు తక్కువ వోల్టేజ్ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తాయని, నికరమైన నిలకడ విద్యుత్‌ను అందించాలన్న ప్రభుత్వ నిబద్ధతను నెరవేరుతుందని మంత్రి పేర్కొన్నారు. మరిన్ని ఫీడర్లను జోడించి పంపిణీని బలోపేతం చేయాలని ఆయన టాటా పవర్‌ను ఆదేశించారు.


