మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు | Telugu Students show their talent at First Lego League Challenge Maryland | Sakshi
Sakshi News home page

మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు

Dec 26 2025 11:00 AM | Updated on Dec 26 2025 11:00 AM

Telugu Students show their talent at First Lego League Challenge Maryland

అమెరికాలో మన తెలుగు వారు అనేక రంగాల్లో దూసుకుపోతున్నారు. తాజాగా మేరీల్యాండ్‌లో తెలుగు బాలికలు టెక్నాలజీతో ఓ సమస్య పరిష్కారం కనిపెట్టి.. ఫస్ట్ లెగో లీగ్ ఛాలెంజ్‌లో క్వాలిఫయర్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నారు. టెక్నాలజీ రంగంలో విశేష ప్రతిభను ప్రదర్శించి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్( స్టెమ్)లో విద్యార్ధుల మేధాశక్తిని, సాంకేతిక ప్రతిభను, సామాజిక బాధ్యతను గుర్తించేలా నిర్వహించే ఫస్ట్ లెగో లీగ్ ఛాలెంజ్'లో పాల్గొన్న ఆరుగురు తెలుగు బాలికల బృందం, క్వాలిఫయర్‌ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. 

హృతిక, సియోన, ప్రజ్ఞ, జాసు, ధృతి, లాస్య అనే ఆరుగురు తెలుగు విద్యార్ధినులు టెక్నోటియారాస్ పేరుతో జట్టుగా ఏర్పడ్డారు. గత నాలుగు నెలలుగా నిరంతర శ్రమ, సాంకేతిక పరిజ్ఞానం, టీమ్ వర్క్‌ను జోడించి తమ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. కేవలం రోబోలను తయారు చేయడమే కాకుండా, సమాజానికి ఉపయోగపడే ఒక వినూత్న పరిష్కారాన్ని వీరు కనుగొన్నారు.

ప్రాణాపాయం లేని ఆస్బెస్టాస్ తొలగింపు!
పాత భవనాల్లో ఉండే 'ఆస్బెస్టాస్' వల్ల కార్మికులకు కలిగే ఆరోగ్య ప్రమాదాలను ఈ బృందం గుర్తించింది. దానికి పరిష్కారంగా ఒక అత్యాధునిక రోబోటిక్ వ్యవస్థను ప్రతిపాదించింది. నిపుణుల సలహాలు తీసుకుంటూ, క్షేత్రస్థాయి పరిశోధనలు చేసి వీరు రూపొందించిన ఈ 'ఇన్నోవేషన్ ప్రాజెక్ట్' అందరి ప్రశంసలు అందుకుంది.

మెక్‌డొనో స్కూల్ క్వాలిఫైయర్ పోటీల్లో పాల్గొన్న టెక్నో టియారాస్ తెలుగు విద్యార్ధుల అద్భుత ప్రదర్శనకు ప్రశంసలు, పురస్కాలు లభించాయి. సామాజిక సమస్యకు పరిష్కారం చూపినందుకు అత్యున్నత 'క్వాలిఫైయర్ ఛాంపియన్‌షిప్' అవార్డును కైవసం చేసుకున్నారు.రోబోట్ డిజైన్ దాని పనితీరులో రెండో స్థానాన్ని సాధించి తమ సాంకేతిక సత్తాను చాటారు. తెలుగు బాలికల మధ్య ఉన్న సమన్వయం, నాయకత్వ లక్షణాలు, వారిలో ఉన్న ఉత్సాహాన్ని చూసి జడ్జీలు సైతం ఆశ్చర్యపోయారు. 

తెలుగు విద్యార్ధినులు సాధించిన ఈ విజయాల వెనుక కోచ్‌లు ఆలోక్, అభిజిత్‌ల మార్గదర్శకత్వం చాలా ఉపకరించింది. అలాగే వారి కుటుంబ సభ్యులు, నాట్స్ మేరీల్యాండ్ చాప్టర్ ప్రతినిధులు ఈ చిన్నారులను నిరంతరం ప్రోత్సహించారు. 

తెలుగు వారందరికి గర్వకారణంగా నిలిచిన ఈ బాలికలు ఇప్పుడు మేరీల్యాండ్ స్టేట్ కాంపిటీషన్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ యువ టెక్నాలజిస్ట్‌ల బృందం మరో మూడు నెలల్లో జరగనున్న ప్రతిష్టాత్మక స్టేట్ లెవెల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి అర్హత సాధించింది. క్వాలిఫయర్‌ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న బాలికల బృందానికి  నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి, నాట్స్ మేరీల్యాండ్ నాయకులు, సభ్యులు అభినందించారు. స్టేట్‌ లెవెల్‌ పోటీల్లోనూ వారు విజయం సాధించాలని ఆకాంక్షించారు.

(చదవండి: సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం! వైరల్‌గా ఎన్‌ఆర్‌ఐ పోస్ట్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement