ఉత్తర అమెరికాలో తెలుగు భాషా బోధనకు అంకితభావంతో పనిచేస్తున్న సిలికానాంధ్ర మనబడి, మరోసారి తన విద్యా ప్రస్థానంలో విశిష్ట విజయాన్ని నమోదు చేసింది. గత 15 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లుగానే, ఈ సంవత్సరం కూడా జూనియర్ సర్టిఫికేట్, సీనియర్ సర్టిఫికేట్ స్థాయులలో నిర్వహించిన వార్షిక తెలుగు విద్యా పరీక్షలకు మొత్తం 3,037 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఈ పరీక్షలను భారతదేశంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పర్యవేక్షించింది. పరీక్షలకు హాజరైన విద్యార్థులలో 98.74% శాతం మంది ఉత్తీర్ణత సాధించడం, ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు కుటుంబాల పిల్లల్లో తెలుగు భాషా పరిరక్షణ, ప్రచారం కోసం సిలికానాంధ్ర మనబడి చేస్తున్న కృషికి గొప్ప గుర్తింపుగా నిలిచింది. పరీక్షల నిర్వహణ కోసం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.మునిరత్నం నాయుడు, పరీక్షల నియంత్రణాధికారి డా.ముసుగు శ్రీనివాసరావు ప్రత్యేకంగా పర్యవేక్షించారు.
56 కేంద్రాల్లో పరీక్షలు
అమెరికా, కెనడా వ్యాప్తంగా ఉన్న 56 కేంద్రాల్లో ఈ పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. విదేశాల్లో జన్మించి పెరుగుతున్న తెలుగు పిల్లలు తమ మాతృభాషను నిబద్ధతతో నేర్చుకోవడం ఎంతో ఆనందదాయకమని మునిరత్నం నాయుడు అన్నారు. 3,037 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవడం, వారిలో దాదాపు 99 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని, తెలుగు భాష పట్ల ఉన్న అభిమానం, అలాగే సిలికానాంధ్ర మనబడి నిర్వహిస్తున్న విద్యా కార్యక్రమాల నాణ్యతకు ఈ ఫలితాలే నిదర్శనం అన్నారు.
మాతృభాషను తరతరాలకు అందించే ఈ యజ్ఞంలో భాగస్వాములైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నిర్వాహకులను అభినందించారు. పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులను సత్కరిస్తూ, అమెరికా, కెనడాలోని 17 ప్రాంతాల్లో స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ, టెక్సాస్‌లోని డల్లాస్, మిచిగన్, వర్జీనియా ప్రాంతాల్లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమాలకు డా. మునిరత్నం నాయుడు అధ్యక్షత వహించారు. ఏరియా యూనివర్సిటీ తెలుగు విభాగాధిపతి డా. మృణాళిని చుండూరి, లాస్ ఏంజెలెస్, సిలికాన్ వ్యాలీలలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు.
ఈ సందర్భంగా సిలికానాంధ్ర మనబడి డీన్, ప్రెసిడెంట్ చమర్తి రాజు మాట్లాడుతూ ‘‘మనబడి ప్రారంభమైన నాటి నుంచి ఉత్తర అమెరికాలోని తెలుగు కుటుంబాలకు మాతృభాషను చేరువ చేయడమే మా లక్ష్యం. ఈ సంవత్సరం సాధించిన 98.74 శాతం ఉత్తీర్ణత, విద్యార్థుల కృషికి, తల్లిదండ్రుల అంకితభావానికి, మా స్వచ్ఛంద ఉపాధ్యాయుల సేవాభావానికి ప్రతిఫలం. తెలుగు భాషను కేవలం నేర్పడం మాత్రమే కాదు, తెలుగు సంస్కృతి, విలువలు, వారసత్వాన్ని తదుపరి తరాలకు అందించాలనే సంకల్పంతో మనబడి ముందుకు సాగుతోంది’’ అని తెలిపారు.


