తానా ప్రపంచ సాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం | Tana World Literary Forum 93th meeting successful | Sakshi
Sakshi News home page

తానా ప్రపంచ సాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం

Jun 30 2026 12:55 PM | Updated on Jun 30 2026 12:58 PM

Tana World Literary Forum 93th meeting successful

తానాసంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలకు పైగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసినదే. 

“అచ్చ తెలుగు తిట్లు” అనే అంశం మీద ఆదివారం జరిగిన 93 వ అంతర్జాల సమావేశం చాలా ఉల్లాసంగా జరిగింది. తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “అనాదినుంచి తిట్లు తెలుగు భాషలో ఒక భాగంగానే ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాలలో, స్నేహితుల మధ్య వాడే కొన్ని పదాలు బయటివారికి కఠినంగా అనిపించినా, అవి అక్కడ వారి ఆప్యాయత లేదా సంబంధాలకు సంకేతాలుగా ఉంటాయన్నారు. 

కన్యాశుల్కం నాటకంలాంటి నాటకాలలోను, పాత సినిమాలలోను వాడిన సరదా తిట్లు సునిశితమైన హాస్యాన్ని పంచాయి. వీధి భాష, గ్రామీణ సంభాషణలలో తిట్లు అలవోకగా చాలా సహజంగా జాలువారతాయి. అయితే అవి మోతాదు మించితే బూతులుగా పరిణమిస్తాయి, ప్రస్తుతం రాజకీయాలలో కొంతమంది రాజకీయనాయకులు “న బూతో న భవిష్యత్” గా మార్చుకుని, ఒకరిని మించి ఒకరు బూతులతో తిట్టుకోవడంతో సమాజంలో జుగుప్సాకర వాతావరణాన్ని సృష్టిస్తున్నది. కనుక వాడే భాష పట్ల జాగ్రత్త అవసరం” అన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు వేదకవి, సినీ గీతరచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ప్రముఖ రచయిత, నటులు తనికెళ్ళ భరణి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత తెలుగు ఆచార్యులు డి. విజయలక్ష్మి, రచయిత ముత్తేవి రవీంద్రనాథ్, ప్రముఖ రచయిత జి.యస్  మోహన్ తదితరులు హాజరయ్యారు. 

చివరగా తానా ప్రపంచ సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ ”తిట్ల మీద ఇంత సుదీర్ఘంగా ఒక సమావేశం జరగడం బహుశా ఇదే మొదటిసారి అయిఉంటుందని, పాల్గొన్న వక్తలందరూ ఎన్నో అరుదైన, విలువైన అంశాలను స్పృశించి ఈ తెలుగు తిట్ల సమావేశానికి శోభను  చేకూర్చారని అందరికీ కృతజ్ఞతలు అన్నారు.

(చదవండి: కలెక్టర్ గారూ..అదే నా చివరి కోరిక! 94 ఏళ్ల బామ్మ విజ్ఞప్తి..)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement