
హైదరాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన విద్యారి్థని దుర్మరణం చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. సిద్దిపేటకు చెందిన శ్రీనివాస వర్మ తన కుటుంబంతో కలిసి 15 ఏళ్ల కిత్రమే నగరానికి వలస వచ్చాడు. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ బాలాజీ కాలనీలో నివాసముంటున్నాడు. ఇతనికి భార్య హేమలత, శ్రీజ వర్మ (23), శ్రీయ వర్మ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
శ్రీనివాస వర్మ బౌరంపేటలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌చార్జిగా హేమలత ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. శ్రీజ వర్మ మాస్టర్స్ చదివేందుకు మూడేళ్ల క్రితం అమెరికాలో వెళ్లింది. చార్లెస్టన్‌లోని ఈస్టర్న్ ఇల్లినోయిస్ యూనివర్సిటీలో కంప్యూటర్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసిన శ్రీజ వర్మ ప్రస్తుతం ఉద్యోగ అన్వేషణలో ఉంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం తన స్నేహితురాలితో కలిసి భోజనం తెచ్చుకునేందుకు తాము నివసిస్తున్న అపార్ట్‌మెంట్ పక్కనే ఉన్న రెస్టారెంట్‌కు వెళ్తున్నారు. వెనుక నుంచి వచి్చన ట్రక్కు శ్రీజను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది.
వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. రోడ్డు ప్రమాదంలో కూతురు చనిపోయిందన్న విషాద వార్త విని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. బాలాజీ కాలనీలోని శ్రీజ ఇంటి వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి శ్రీజ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని బంధువులు కోరుతున్నారు.