
తిరిగే కాలు, తిట్టే నోరు ఉరికే ఉండవని సామెత. కొంతమంది తెగ తిరుగుతుంటారు. నిరంతరం ప్రయాణిస్తుంటారు. కొత్త ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలను చుట్టి వస్తుంటారు. ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య బాగా పెరిగింది. ఉన్నత చదువులు, ఉద్యోగాలతో పాటు పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రపంచ యాత్రలు చేస్తున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడడం లేదు.
15 లక్షల కోట్లు!
ప్రపంచ యాత్రలు చేసేవాడు ప్రజ్ఞావంతుడౌతాడని పెద్దలు చెబుతుంటారు. దీన్నే ఫాలో అవుతున్నారు మనవాళ్లు. విదేశీ ప్రయాణాల కోసం భారతీయులు భారీగానే ఖర్చుపెడుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. 2009-10లో విదేశీ ప్రయాణాలకు 17 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.50 లక్షల కోట్లు) వెచ్చించారు. ఈ వ్యయం 2024-25 నాటికి దాదాపు వెయ్యి రెట్లు (975%) శాతం పెరిగి 17 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 15 లక్షల కోట్లు) చేరుకుంది. ఈ లెక్కన చూసుకుంటే సగటు వార్షిక వృద్ధి రేటు 58.2 శాతంగా ఉంది.
జర్నీలకే ఎక్కువ!
గతంలో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఇండియన్స్ ఎక్కువగా ఖర్చు చేసేవారు. కానీ ఇప్పుడు ప్రయాణాల కోసం కూడా అధికంగా వెచ్చిస్తున్నారు. ఈక్విటీ నుంచి రియల్ ఎస్టేట్ (Real Estate) వరకు ప్రతిదానికీ డబ్బు ఖర్చు పెడుతున్నారు. అయితే విదేశీ ప్రయాణాలకు కూడా ఎక్కువ మొత్తంలో వ్యయం చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇంకా వివరంగా చెప్పాలంటే విదేశాల్లో చదువు కంటే కూడా జర్నీలు చేయడానికే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఈ వ్యయం గత 15 ఏళ్లలో 1000 రెట్లు పెరగడమే ఇందుకు నిదర్శనం.
ఎక్కడికి వెళ్తున్నారు?
తుర్కియే, ఫ్రాన్స్, మారిషస్, అమెరికా, బ్రెజిల్, చైనాతో సహా ప్రపంచంలోని అనేక దేశాలను భారతీయులు చుట్టి వస్తున్నారు. 2009 సంవత్సరంలో 1.1 కోట్ల మంది ఇండియన్స్ విదేశాలు వెళ్లారు. కోవిడ్-19 (Covid-19) మహమ్మారికి ముందు ఈ సంఖ్య 2.6 కోట్లకు పెరిగింది. కరోనా సమయంలో ఈ సంఖ్య బాగా తగ్గింది. కానీ, కరోనా ముగిసిన తర్వాత పరిస్థితి మెరుగుపడటంతో, 2022లో విదేశాలకు ప్రయాణించిన (travel abroad) భారతీయుల సంఖ్య మళ్లీ 2 కోట్లు దాటింది.
చదువుకెంత ఖర్చు?
భారతీయులు మెరుగైన జీవితాన్ని గడపడానికి విదేశాల వైపు మొగ్గు చూపుతున్నారని టీఓఐ నివేదిక వెల్లడించింది. ఉన్నత విద్య, మెరుగైన ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతున్నారు. ఉపాధికి భరోసాయిచ్చే నాణ్యమైన ఉన్నత విద్య కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. విదేశాల్లో విద్యాభ్యాసం కోసం 2024-25లో మనవాళ్లు చేసిన వ్యయం 9.6 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. 2009-10లో ఈ వ్యయం 549 మిలియన్ డాలర్లు. ఏడాదికి 21 శాతం పెరుగుదల నమోదయింది.
చదవండి: ప్రపంచంలోనే ఎత్తైన భవనం.. బుర్జ్ ఖలీఫా ఓనర్ ఎవరో తెలుసా?