ఆస్ట్రేలియా అడిలైడ్‌లో జరిగిన ఎన్నారై మహిళ సుప్రియ హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమె భర్త విక్రాంత్ ఠాకూర్ ఎట్టకేలకు నోరు విప్పారు. ఉద్దేశపూర్వకంగా తన భార్యను చంపలేదని.. తన కొడుకు కోసమైనా తనను క్షమించి వదిలేయాలని కోర్టును బతిమిలాడుకుంటున్నాడు.
భారత మూలాలు ఉన్న విక్రాంత్ ఠాకూర్(42), భార్య కొడుకుతో అడిలైడ్‌లో స్థిరపడ్డాడు. గతేడాది డిసెంబర్ 21వ తేదీన తన నివాసంలో సుప్రియ(36) అపస్మారక స్థితిలో కనిపించింది. ఎమర్జెన్సీ టీం ప్రయత్నాలు చేసినా ఆమెను కాపాడలేకపోయింది. ఈ ఘటనలో అనుమానాల కింద భర్తను అప్పటికప్పుడు అదుపులోకి తీసుకన్నారు స్థానిక పోలీసులు. ఆపై హత్య కేసు నమోదు చేసి స్థానిక మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు.
అయితే.. అదే ఏడాది(డిసెంబర్ 23) జరిగిన కోర్టు విచారణలో విక్రాంత్ నోరు విప్పలేదు. బెయిల్ కోసం కూడా అప్లై చేసుకోలేదు. దీంతో భార్యను అతనే చంపి ఉంటాడని అంతా భావించారు. ఆ సమయంలో డీఎన్‌ఏ రిపోర్ట్స్, పోస్ట్‌మార్టం నివేదిక వంటి ఆధారాలు సిద్ధం కావడానికి సమయం కావాలని ప్రాసిక్యూటర్లు కోరారు. దీంతో విచారణ వాయిదా పడింది. తాజాగా జనవరి 14న మరోసారి విచారణ జరగ్గా.. తన భార్యను తాను కావాలని హత్య చేయలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఇది అనుకోకుండా జరిగిన మరణం(manslaughter). నేనేమీ కావాలని ఆమెను చంపలేదు అంటూ వాదించాడు. తన బిడ్డ కోసం తనను వదిలేయాలంటూ వేడుకున్నాడు. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది కోర్టు. విక్రాంత్-సుప్రియ కొడుకు సంరక్షణను అక్కడి ఇండియన్ కమ్యూనిటీ చూసుకుంటోంది. ఫండ్ రైజింగ్ ద్వారా విరాళాలు సేకరిస్తోంది. "సుప్రియా తన కొడుకు భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేసింది. నర్సుగా మారి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం ఆమెకు ఉండేది. ఆమె ఆకస్మిక మరణం కుమారుడి జీవితాన్ని ఒక్కసారిగా తారుమారు చేసింది" అని ఆ పేజీలో పేర్కొన్నారు.


