లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో చోరీకి యత్నించిన నిందితుడు పోలీసులకు పట్టుబడ్డాడు. ఎస్సై దీపక్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా.. గాంధారికి చెందిన శశికుమార్ అనే వ్యక్తి లింగంపేట మండలం లింగంపల్లి శివారులోని వాటర్ ప్లాంట్‌లో ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శశికుమార్ సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఎస్‌బీఐ ఏటీఎంకు ఆటోలో వచ్చాడు. ఆటోను ఓ ఇంటి పక్కన సందులో నిలిపి ఏటీఎంలోకి చొరబడ్డాడు. ఏటీఎంలోని నగదును దోచుకునేందుకు ఏటీఎంను ధ్వంసం చేస్తుండగా శబ్ధం రావడంతో ఇంటి యజమాని పంబళ్ల శ్రీనివాస్ నిద్రలోనుంచి లేచి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్సై దీపక్‌కుమార్ తన సిబ్బందితో ఏటీఎం వద్దకు చేరుకొని చోరీకి యత్నిస్తున్న శశికుమార్‌ను పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి ఉదయం ఏటీఎం కేంద్రం వద్దకు చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


