డొంకేశ్వర్(ఆర్మూర్) : జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ప్రశాంత్ బాజీరావు పాటిల్ శాఖలో ప్రక్షాళన ప్రారంభించారు. ఇన్ని రోజులు పని లేక నీరసించిన టాస్క్‌ఫోర్స్ విభాగంలో కొత్తవారిని నియమించి పునర్జీవం పోశారు. కేవలం ఇద్దరికే పరిమితమైన టాస్క్‌ఫోర్స్ బృందంలో అత్యంత చురుకై న 9మంది బీట్ ఆఫీసర్లను చేర్చి టీమ్‌ను బలోపేతం చేశారు. ఇందులో ప్రతి ముగ్గురు బీట్ ఆఫీసర్లను కలిపి ఒక టీమ్‌గా ఏర్పాటు చేయగా, వీరిపైన ఒక ఎఫ్‌ఆర్వో, సెక్షన్ అధికారి ఉన్నారు. వీరంతా నేరుగా డీఎఫ్‌వో కనుసన్నల్లో పని చేయనున్నారు. డీఎఫ్‌వో ఆదేశాలతోనే ఈ టీమ్ రహస్య ఆపరేషన్‌లలోకి దిగనుంది. అటవీ ప్రాంతాల్లో కదలికలపై నిఘా పెట్టడం, ఎక్కడికక్కడ లాకస్మిక తనిఖీలు నిర్వహించడమే బృందం పని. అడవుల్లో జరిగే ఉల్లంఘనలు, అక్రమ రవాణాపై క్షేత్రస్థాయిలో లోతుగా విచారణ జరిపి, ఎప్పటికప్పుడు డీఎఫ్‌వోకు నివేదికలు సమర్పించనున్నారు. అయితే, ఇదివరకు పని చేసిన డీఎఫ్‌వోలు టాస్క్‌ఫోర్స్ విభాగాన్ని నిర్లక్ష్యం చేసి అసలు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి.
అధికారులు, సిబ్బందిలో వణుకు!
నూతన డీఎఫ్‌వోగా ప్రశాంత్ బాజీరావు పాటిల్ రావడంతోనే శాఖను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే విధులకు రాకుండా ఉన్న ఇద్దరు బీట్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. రెంజల్ మండలం నీలా వద్ద బొగ్గుబట్టీ విషయంలోనూ అధికారులపై సీరియస్‌గా ఉన్నారు. దీనికి తోడు తాజాగా నూతన టాస్క్‌ఫోర్స్ బృందం ఏర్పాటుతో శాఖలోని కొందరు అవినీతి, నిర్లక్ష్యపు అధికారుల గుండెల్లోనూ వణుకు పుట్టిస్తోంది. డీఎఫ్‌వో ఆదేశిస్తే.. క్షేత్రస్థాయిలో అటవీ అధికారులు, సిబ్బంది పనితీరును కూడా ఈ టీమ్ నిశితంగా పరిశీలించనుంది. విధుల్లో అలసత్వం వహించినా, అక్రమార్కులకు సహకరించినా ఎవరినీ వదిలిపెట్టబోమని సంతేకాలు ఇవ్వడంతో అటవీ శాఖలో అందరికీ గుబులు పట్టుకుంది. పలువురు ఎఫ్‌ఆర్వోలు, డీఆర్వోలు, జిల్లా నుంచి బదిలీ చేసుకుంటేనే బతికి బయటపడుతామనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
9మంది బీట్ ఆఫీసర్లతో ఏర్పాటు
డీఎఫ్‌వో కనుసన్నల్లో పని చేయనున్న ప్రత్యేక బృదం
ఆకస్మిక తనిఖీలు.. విచారణ
నివేదికలు ఇవ్వడమే టీమ్ పని


