వేల్పూర్(మెండోరా): మెండోరా మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం రాత్త్రి మద్యం మత్తులో కాకతీయ కాలువలో దిగి మునుగుతూ, తేలుతూ హల్‌చల్ చేశాడు. గ్రామస్తులు, పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడంతో చివరకు ఎస్సై సుహాసిని ఘటన స్థలానికి వచ్చి అతడికి నచ్చజెప్పి కాలువ ఒడ్డుకు చేర్చారు. అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాలువలో తక్కువ ప్రవాహం ఉండడంతో పూర్తిగా మునిగిపోకుండా ప్రాణాపాయం తప్పింది.
బోధన్‌రూరల్: సాలూర మండలంలోని హున్సా శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకున్నట్లు బోధన్ రూరల్ ఎస్సై రాజశేఖర్ సోమవారం తెలిపారు. పట్టుబడిన వారి వద్ద నుంచి రూ.7,400లు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.
నిజామాబాద్ అర్బన్: ప్రతి ఆటో డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ సీఐ ప్రసాద్ అన్నారు. నగరంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఆయన ఆటోడ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ట్రాఫిక్ సీఐ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రద్దీగా ఉన్నచోట ఆటో డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలన్నారు.
నిజామాబాద్ అర్బన్: నగరంలోని ఒకటో టౌన్ పరిధిలోగల ఫ్రూట్ మార్కెట్‌లో ఇటీవల కొందరి యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా, ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మూడో వ్యక్తి షేక్‌రహీమ్ పరారీలో ఉండగా, సోమవారం అతడిని అరెస్టు చేసినట్లు ఒకటవ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు.
నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలం ఆంధ్రనగర్ గ్రామ సమీపంలో ఓ వ్యానులో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా సోమవారం సాయంత్రం నందిపేట పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆంధ్రానగర్‌లోని ఒక బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అందులో మొత్తం 57 సంచులలోని 31క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. అట్టి బియ్యానికి ఎటువంటి ఆధారాలు వారివద్ద లేకపోవడంతో వాటిని నందిపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రైవర్ ఖలీమ్‌తోపాటు ఓనర్ మాక్లూర్‌కు చెందిన ఇమ్రాన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వినయ్ వెల్లడించారు.


