పంటను రైతులు పరిశీలించాలి..
● నివారణ చర్యలు సూచించిన
వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ
ఆర్మూర్: సోయాబీన్‌కు సోకిన తెగుళ్లను రైతులు గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో సుమారుగా 35,166 ఎకరాల్లో సోయా పంటను రైతులు పండిస్తున్నారు. వేరుకుళ్లు, లద్దె పురుగులతో పంట నష్టపోవడాన్ని రైతులు అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. ఈక్రమంలో ఆర్మూర్ మండలంలోని పలు గ్రామాల్లో సోయాబీన్ పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించి తెగులు నివారణకు రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏవో హరికృష్ణ మాట్లాడుతూ.. సోయాబీన్‌లో వేరుకుళ్లు నివారణకు వర్షాలు తగ్గిన తర్వాత 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లు తడిచే విధంగా పోయాలన్నారు.
● పొగాకు లద్దె పురుగు ఆశించడం గమనించినట్లయితే నివారణకు 1మీ.లీ నోవాల్యురాన్ లేదా 0.3 మి.లీ క్లోరాంట్రనిలీప్రోల్ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
● సోయా ఆకులపై రంధ్రాలు గమనిస్తే, నివార ణకు ఐదు కిలోల తవుడు, ఒక కిలో బెల్లం, 400 మిల్లీలీటర్ల మోనోక్రోటోపాస్‌ను కలిపి ఉండలుగా చేసి సాయంత్రం పూట పొలంలో చల్లాలి. పగలు నేలలో ఉండి సాయంత్రం పూట బయటకు వచ్చే లద్దె పురుగులు వీటిని తిని చనిపోతాయి.
● సోయా ఆకులను సెమిలూపర్ అనే గొంగలి పురుగు తినేసి పంటను నష్టం కలిగిస్తుంది. ఈ పురుగును నివారించడానికి 350 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరం పొలంలో పిచికారి చేయాలి.
● సోయాబీన్ ఆకులు, కాయలను పచ్చ పురుగు తిని పంటను నష్టం కలిగిస్తుంది. ఈ పురుగును నివారించడానికి 125మిల్లీలీటర్ల రిమాన్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరంలో పిచికారి చేయాలి.
● సోయా మొక్క కాండం లోపల కాండం ఈగ (స్టెమ్ ఫ్లె) ఆహార పదార్థాన్ని తినివేస్తుంది. దీంతో సోయా మొక్క వాడిపోయి ఎండిపోతుంది. ఆ మొక్కను చీల్చి చూస్తే ఎర్రని ఎండిన పదార్థం కనిపిస్తుంది. ఈ కాండం ఈగ నివారణకు 300 గ్రాముల ఎసిఫెట్ పొడిని 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరం సోయ పంటపై పిచికారి చేయాలి.
● సోయా పంట వద్దకు పురుగులు రాకుండా నివారణ చర్యకు వేపనూనె 1,500 పీపీఎంను 300 నుంచి 500 మిల్లీ లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరంలో పిచికారి చేయాలి. రైతులు ఈ విధంగా చేస్తే తెగుళ్లను నివారించవచ్చు. సోయాబీన్ పూత, పిందె రాలకుండా, కాయగట్టితనానికి 19:19:19ని ఒక కిలో తీసుకొని నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచికారి చేయాలి.
సోయాబీన్ పంటను పండిస్తున్న రైతులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. సోయాలోని ఆకులు, కాయలు, కాండాన్ని రైతులు పరిశీలించాలి. తెగుళ్లు సోకినట్లు భావిస్తే వెంటనే మందులను పిచికారి చేయాలి. తెగుళ్ల బారి నుంచి పంటను రక్షించాలి.
– హరికృష్ణ, వ్యవసాయాధికారి, ఆర్మూర్ మండలం


