ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

Aug 12 2026 3:10 AM | Updated on Aug 12 2026 3:10 AM

నిజామాబాద్‌ అర్బన్‌: ఆర్థిక ఇబ్బందులతో దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. నాలుగో టౌన్‌ ఎస్‌హెచ్‌వో సతీష్‌ తెలిపిన వివరాలిలా ఉన్నా యి. నిజామాబాద్‌ నగరంలోని కోటగల్లికి చెందిన శేషాల నరేశ్‌(33) విద్యుత్‌ శాఖలో బిల్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి 2014లో మేఘన(30)తో వివాహమైంది. వీరికి తొమ్మిదేళ్ల వయసున్న ఆయాన్ష్‌, ఆరేళ్ల వయసున్న మిథున్‌ ఉన్నారు. నరేశ్‌ గతేడాది రూ.90 లక్షలతో ఇల్లు కొనుగోలు చేశాడు. హోమ్‌ లోన్‌ కోసం ప్రయత్నించగా మంజూరు కాలేదు. దీంతో అప్పులు పెరిగి ఇంటిని అమ్మే శాడు. ప్రస్తుతం వినాయక్‌నగర్‌లోని పంచము ఖి హనుమాన్‌ టెంపుల్‌ సమీపంలో అద్దెకు ఉంటున్నారు. ఇంటి కోసం చేసిన అప్పుల భారం పెరిగిపోవడంతో మానసిక ఒత్తిడికి గురైన నరేశ్‌.. మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత అతడి భార్య మేఘన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మేఘనకు తల్లి లావణ్య ఫోన్‌చేయగా ఆమె సరిగా మాట్లాడకపోవడంతో అనుమానించి భర్త మోహన్‌కు విషయం చెప్పింది. దీంతో ఆయన ఇంటికి చేరుకుని, కిటికీ చువ్వలను తొలగించి లోపలికి వెళ్లి చూడగా.. మేఘన పురుగుల మందు సేవించి పడిపోయి ఉంది. నరేశ్‌ ఉరివేసుకొని వేలాడుతున్నాడు. హుటాహుటిన నరేశ్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ‘భార్యభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నాం. మానసిక ఒత్తిడి ఉంది’ అని నరేశ్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ ఇంట్లో లభించింది. మృతురాలి తండ్రి మోహన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement