● పబ్లిక్ – ప్రైవేట్ భాగస్వామ్యంతో
పనులు చేపట్టే అవకాశం
● ఇటీవల ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్
ప్రాంతాలను పరిశీలించిన ఇన్వెస్టర్లు
డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రకృతి రమణీయతకు నిలయమైన ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతం త్వరలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. డొంకేశ్వర్ మండలంలోని చిన్నయానం, గాదేపల్లి గ్రామాల వద్ద పబ్లిక్ – ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో ఎకో టూరిజం పనులు చేపట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా పర్యాటకులను ఆకర్షించేలా అత్యాధునిక కాటేజీలు, రిసార్టులు, వాచ్ టవర్లను నిర్మించేందుకు ప్రైవేటు పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. ఇక్కడి టూరిజం ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన హైదరాబాద్‌కు చెందిన పలువురు ప్రముఖ ఇన్వెస్టర్లు ఇటీవల ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని సందర్శించారు. చిన్నయానం, గాదేపల్లి పరిసరాల్లో పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం స్థానిక అటవీశాఖ అధికారులతో ప్రత్యేక భేటీ అయ్యారు. స్థానిక అటవీ, ప్రాజెక్టు భూములు, నిబంధనలు, వన్యప్రాణుల సంచారం, భౌగోళిక పరిస్థితులకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వంతో భాగస్వామ్యమై ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎకో టూరిజం అభివృద్ధి ద్వారా స్థానిక గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇదివరకే అటవీ శాఖ ఆధ్వర్యంలో చిన్నయానం, గాదేపల్లి గ్రామాల నుంచి 10 మంది యువకులు హైదరాబాద్‌కు వెళ్లి శిక్షణ పొంది వచ్చిన ఈ విషయాన్ని అటవీ అధికారులు ఇన్వెస్టర్ల దృష్టికి తీసుకెళ్లారు. హోటల్ మేనేజ్‌మెంట్, గైడ్‌లు, బోటింగ్ నిర్వహణ రంగాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఇన్వెస్టర్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే నిజామాబాద్ జిల్లా పర్యాటక రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.
స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు
ప్రైవేట్ – పబ్లిక్ పార్టనర్‌షిప్ పద్ధతిలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఇన్వెస్టర్లు ముందుకు రావడం హర్షణీయం. ప్రభుత్వంతో ఒప్పందమై ఈ ప్రాజెక్టు పనులు మొదలైతే పర్యావరణ పరిరక్షణతోపాటు స్థానిక గ్రామాల్లోని నిరుద్యోగ యువతకు గైడ్‌లు, కాటేజీల నిర్వహణలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – చంద్రశేఖర్, ఎఫ్‌డీవో, ఆర్మూర్


