డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): జిల్లాలోని 89 సహకార సంఘాల పరిధిలో గత మూడేళ్లలో రూ.3.71 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగింది. ఎత్తొండ, పడగల్, మాక్లూర్ సహకార సంఘాల్లో వెలుగు చూసిన అవినీతి, అక్రమాలను మరువకముందే జక్రాన్‌పల్లి మండలంలోని అర్గుల్ సొసైటీలో అవకతవకలు బయటపడ్డాయి. ఖర్చు, జమాపద్దుల లెక్కల్లో తేడాలు, రైతు రుణాల్లో భారీ వ్యత్యాసాలు సొసైటీని దివాలా తీయిస్తున్నాయి. ధాన్యం కొనుగోలు పేరిట పాతకూలీలకు అడ్వాన్స్ ఇవ్వడం, కొత్త కూలీలకు పెద్దమొత్తంలో ఖర్చుచేయడం, నూతన ఫర్నిచర్, ఇతర వస్తువుల కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టడంతో సొసైటీ నష్టాల బాట పట్టింది. 2024–25 అడిట్ నివేదికలో అవతవకలు వెలుగు చూశాయి.
సొసైటీలో అర్గుల్, జక్రాన్‌పల్లి, పడకల్, కేశ్‌పల్లి, సికింద్రాపూర్ గ్రామాలకు చెందిన 5,393 మంది రైతులు సభ్యత్వం కలిగి ఉండగా, సొసైటీ వాటాధనం రూ.1.20 కోట్లుగా ఉంది. సొసైటీ కార్యదర్శిగా ఒక అధికారి దీర్ఘకాలం ఇక్కడ పని చేయడం, పాలకవర్గం ఇష్టానుసారంగా వ్యవహ రించడంతో 2024–25 ఆడిట్ నివేదిక ప్రకారం సొసైటీకి రూ. 21.31 లక్షల నష్టం వాటిల్లింది. వడ్డీ లెక్కల్లో వ్యత్యాసం, పలు రిజిస్టర్లు నిర్వహించక పో వడం, అధిక ధాన్యం కొనుగోలు, రవాణా ఖర్చుల పై అభ్యర్థులు వచ్చాయి. రుణాల విషయానికి సంబందించి సీసీబీ కి సంబంధించిన రుణ బకాయి, సభ్యుల నుంచి రావాల్సిన రుణాలకు రూ.1.74 కోట్ల భారీ వ్యత్యాసం వెలుగుచూసింది. రైతుల నుంచి అధిక వడ్డీ వసూలు చేస్తున్నట్లు ఆడిట్ నివేదిక ద్వారా తేటతెల్లమైంది. అలాగే నూతన భవనంలో ఫర్నిచర్ పేరిట రూ.7.97 లక్షలు ఖర్చు చేశారు. ఇలా విచ్చలవిడిగా ఖర్చులు చేసి సొసైటీని నష్టాల బాట పట్టించారని రైతులు విమర్శిస్తున్నా రు. గతంలో ఎస్‌పీఎస్, పీఎల్ రుణాలు తీసుకుని పలువురు రైతుల మృతి చెందగా.. వారి వారసులకు రిజర్వ్‌బ్యాంకు నిబంధనల ప్రకారం సంవత్సరాల తరబడి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రస్తుతం వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.21.31 లక్షల నష్టం
ఫర్నిచర్ కొనుగోళ్లలో భారీగా ఖర్చులు
రుణ బకాయిలు, వసూళ్లలో భారీ వ్యత్యాసాలు
ఆడిటింగ్‌కు కీలక రికార్డులు
చూపని వైనం


