బీసీ మహిళలకు కొత్త పథకం 100 శాతం సబ్సిడీతో అందజేత 18 నుంచి 55ఏళ్లలోపు మహిళలు అర్హులు వితంతు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యం సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు గడువు
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత, ఆర్థికాభివృద్ధికి ఇందిర మహిళా శక్తి ద్వారా సంక్షేమ పథకాలు, అవకాశాలు కల్పిస్తోంది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తెల్లరేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా వ్యాపార అవకాశాలు, వడ్డీలేని రుణాలు, రుణ బీమా పథకం, ఆరోగ్యలక్ష్మి, స్వయం ఉపాధి పథకాలను అందిస్తోంది. ఈ క్రమంలోనే బీసీ సామాజికవర్గానికి చెందిన నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా 100 శాతం సబ్సిడీతో ఉచితంగా ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా అర్హులైన మహిళల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించే విధంగా షెడ్యూల్ ప్రకటించింది. తొలి విడతగా రూ.12 వేల విలువైన ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయడానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించింది.
ఉపాధి అవకాశాలు
కుట్టు మిషన్ల ద్వారా బీసీ మహిళలు ఉపాధి పొందే అవకాశం ఉంది. 100 శాతం సబ్సిడీతో ఇస్తున్న ఈ మిషన్లను సద్వినియోగం చేసుకుంటే వ్యాపారాలు ముందుకు సాగే అవకాశం ఉంటుంది. చాలామంది మెప్మా, సెర్ప్ ద్వారా కుట్టు మిషన్లలో శిక్షణ పొంది జీవనోపాధి పొందుతున్నారు. ఈ ఆటోమేటిక్ మిషన్ల వల్ల పని భారం తగ్గి మహిళలకు మేలు కలుగుతుంది.
మండలస్థాయి కమిటీలు..
ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు కన్వీనర్లుగా ఉండగా, దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హుల జాబితాను జిల్లాస్థాయి కమిటీకి పంపిస్తారు. జిల్లాస్థాయి కమిటీ ఆమోదం పొందిన అనంతరం బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం బీసీ మహిళల అభివృద్ధి కోసం ఉచిత ఆటోమెటిక్ కుట్టుమిషన్లు అందించనుంది. ఇంటింటా ఇందిరమ్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బీసీ మహిళలు ఆన్‌లైన్ లో వచ్చేనెల 13 లోపు దరఖాస్తులు చేసుకోవాలి. ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో అందించాలి.
–శ్రీనివాస్, బీసీ అభివృద్ధి అధికారి
అర్హతలు
దరఖాస్తుదారులు బీసీ వర్గానికి చెందిన నిరుద్యోగ మహిళలు అయి ఉండాలి. నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనా థలు, మేర/మేరు కమ్యూనిటీ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు. తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలి. ఒ క కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం. కుట్టు వృత్తిలో నైపుణ్యం, ప్రాథమిక అక్షరాస్యత ఉన్నవారికి ప్రాధాన్యత. అర్హులైన బీసీ మహిళలు సెప్టెంబర్ 15 లోపు http:// tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
నియోజకవర్గానికి వెయ్యి..
ముందుగా ప్రతీ నియోజకవర్గానికి వెయ్యి కుట్టు మిషన్లు అందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో నిర్మల్, ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతీ నియోజకవర్గంలో వెయ్యి మంది బీసీ మహిళలను ఎంపిక చేయనున్నారు. ఎంపికై న లబ్ధిదారులకు ఆటోమేటిక్ మిషన్లు అందించనున్నారు.


