గణపతి బప్పా మోరియా | - | Sakshi
Sakshi News home page

గణపతి బప్పా మోరియా

Sep 23 2026 12:07 AM | Updated on Sep 23 2026 12:07 AM

● కాషాయమయమైన భైంసా ● ప్రారంభమైన గణనాథుల శోభాయాత్ర.. ● ఆధ్యాత్మికతను చాటిన సంప్రదాయ ప్రదర్శనలు

భైంసా/భైంసారూరల్‌: భైంసా పట్టణంలో గణనాథుల నిమజ్జన శోభాయాత్ర మంగళవారం ప్రారంభమైంది. దీంతో పట్టణం కాషాయమయంగా మారింది. వీధులన్నీ గణేశుడి నామస్మరణతో మార్మోగాయి. శోభాయాత్ర పొడవునా రంగులు చల్లుకుంటూ, ‘గణపతి బప్పా మోరియా.. మంగళమూర్తి మోరియా’ అంటూ యువకుల కేరింతల మధ్య గణనాథులు ముందుకు సాగారు. గణపయ్యను సాగనంపే వేళ పట్టణమంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. గోపాలకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజల అనంతరం ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌, ఎస్పీ జానకీషర్మిల, మున్సిపల్‌ చైర్మన్‌ తూమొల్ల దత్తాత్రి, ఉత్సవ సమితి అధ్యక్షుడు సరికొండ శ్రీనివాస్‌, హిందూ వాహిని, ఆర్‌ఎస్‌ఎస్‌, శాంతి కమిటీ సభ్యులు, పురప్రముఖులు శోభాయాత్రను ప్రారంభించారు. మున్నూరుకాపు సంఘం భవనం వద్ద నిర్వాహకులు ప్రముఖులను శాలువాలతో సత్కరించారు.

అడుగడుగునా ఆధ్యాత్మిక సందడి

శోభాయాత్రలో డీజేలు, బ్యాండ్‌ మేళా లు, భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచా యి. మహిళల కోలాటాలు, చిన్నారుల నృత్యాలు, యువత స్టెప్పులు, భక్తుల జైకారాలతో ప్రధాన వీధులు సందడిగా మారాయి. మున్నూరుకాపు సంఘం గణేశ్‌ వద్ద కోలాటం ఆకట్టుకోగా, హాతీ గణేశ్‌ మండలి ఆధ్వర్యంలో సాగిన మరాఠీ భజనలు సంప్రదాయ భక్తి భావాన్ని చాటాయి. శోభాయాత్రలో భక్తులు నృత్యాలు చేస్తూ, జైకారాలు చేస్తూ ముందుకు సాగారు. దారి పొడవునా ప్రజలు ఇళ్ల ముంగిళ్ల వద్దకు వచ్చి గణనా థుడిని దర్శించుకుని పూజలు చేశారు.

భక్తులకు సేవలు

శోభాయాత్ర మార్గంలో పలుచోట్ల భక్తులకు అల్పాహారం, అన్నదానం, తాగునీరు పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాల్లో యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్‌ యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేసింది.

అడుగడుగునా నిఘా

నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 600 మంది పోలీసులతో భద్రత కల్పించారు. 19 పికెట్లు, ఏడు సెక్టార్లుగా పట్టణాన్ని విభజించి నిఘా పెట్టారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో శోభాయాత్ర మార్గాలను పర్యవేక్షించారు. ఎస్పీ జానకీషర్మిల స్వయంగా మార్గాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులను సమన్వయం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement