అప్రమత్తం.. సమన్వయం | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తం.. సమన్వయం

Aug 18 2026 12:15 AM | Updated on Aug 18 2026 12:15 AM

● ‘సర్‌’ ఫేజ్‌–2లో సమర్థవంతంగా వ్యవహరించాలి ● ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ సావంత్‌, ఇన్‌చార్జి మంత్రి జూపల్లి ● కాంగ్రెస్‌ ఉమ్మడి జిల్లా పీఏసీసమావేశం ● ‘హస్తం’ శ్రేణులకు నేతల దిశానిర్దేశం

సాక్షి, ఆదిలాబాద్‌: అర్హులైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలి.. సర్‌ ఫేజ్‌–2లో పార్టీ మండల అధ్యక్షులు, బీఎల్‌ఏ–2ల ద్వారా పూర్తిగా సమీక్షించాలని కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) నిర్ణయించింది. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లోని జీఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లాల పీఏసీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ సావంత్‌, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ‘సర్‌’, పార్టీ కమిటీల నియామకాలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, స్థానిక రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు. పలు అంశాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

సమర్థవంతంగా పర్యవేక్షించాలి..

ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల, తొలగించే ఓటర్లపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో సర్‌ ఫేజ్‌–2 ప్రక్రియలో పార్టీ శ్రేణులు సమర్థవంతంగా పర్యవేక్షించి అర్హులైన ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పట్టణ, డివిజన్‌, మండలస్థాయి కాంగ్రెస్‌ కమిటీల నియామకాలు ఆగస్టు 31లోగా పూర్తి చేసి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలని స్పష్టం చేశారు. పార్టీ కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో విస్తరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై పీఏసీ సమావేశంలో చర్చించారు. ప్రజలకు వివరించడంతో పాటు పార్టీని బలోపేతం చేసేందుకు నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

నామినేటెడ్‌ పదవులపై చర్చ..

జిల్లాలోని కాంగ్రెస్‌ నాయకులతో నామినేటెడ్‌ పదవులపై చర్చించారు. పార్టీ కోసం కష్టపడే వారికి తప్పనిసరిగా గుర్తింపునిస్తామని ముఖ్య నేతలు పేర్కొన్నారు. అటువంటి వారికే కమిటీలో చోటు ఉంటుందని స్పష్టం చేశారు. మతతత్వ రాజకీయాలను క్షేత్రస్థాయిలో తిప్పికొట్టడానికి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో ఆదిలాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సంజీవ్‌రెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సమావేశంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్‌, ఆత్రం సుగుణ, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపురావు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు కంది శ్రీనివాస్‌రెడ్డి, ఆడే గజేందర్‌, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్‌ సుజాత, ఓబీసీ విభాగం అధ్యక్షుడు అంబకంటి అశోక్‌, ఎస్సీ విభాగం అధ్యక్షుడు పరమేశ్వర్‌, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు చరణ్‌గౌడ్‌, ఆయా జిల్లాల పీఏసీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement