బీఏఎస్ పథకం కింద బిల్లులు చెల్లించని ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోని ప్రైవేట్ విద్యాసంస్థలు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న తల్లిదండ్రులు
నిర్మల్‌చైన్‌గేట్: బెస్ట్ అవైలబుల్ స్కూల్(బీఏఎస్) సబ్సిడీ పథకంలో చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ఫీజులు మంజూరు కావటంలేదని బడుల యాజమాన్యాలు పిల్లలను పట్టించుకోవడం లేదు. కార్పొరేట్‌స్థాయి చదువులను చదివించే స్థోమతలేక.. బడి నుంచి బయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్(బీఏఎస్) పథకంలో భాగంగా ఎస్సీ కులానికి చెందిన పేద విద్యార్థులను లాటరీ పద్ధతిన ఎంపిక చేసి వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 470 మంది విద్యార్థులు బీఏఎస్ పథకంలో వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. కాగా ప్రభుత్వం బీఏఎస్ పథకంలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఫీజులను మంజూరు చేయటం లేదు. దీంతో జిల్లా కేంద్రానికి చెందిన మూడు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
కలెక్టరేట్ చుట్టూ..
విద్యార్థులను పట్టించుకోకపోవడంతో వారి తల్లిదండ్రులు వారంరోజులుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. మా పిల్లలను ఎలాగైనా చదువుకునే విధంగా చూడాలని కలెక్టర్ తోపాటు డీఈవోకు, ఎస్సీ సంక్షేమశాఖ అధికారులకు వినతిపత్రాలు అందించారు. తమ పిల్లల చదువులు యథావిధిగా కొనసాగేవిధంగా చూడాలని వేడుకుంటున్నారు.
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు 3
బీఏఎస్ కింద చదివే విద్యార్థులు 470
డే స్కాలర్‌కు ఏడాదికి చెల్లించేది రూ.28 వేలు
రెసిడెన్షియల్ విద్యార్థులకు రూ.42 వేలు
మొత్తం బకాయిలు..
విజయ హైస్కూల్‌కు రూ.1,52,95,859
రవి హైస్కూల్‌కు రూ.1,22,97,740
వశిష్ఠ హై స్కూల్‌కు రూ.21,71,247


