న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) చేపట్టిన ఆందోళన మరింత తీవ్రమవుతోంది. దీంతో జ్ఞానేశ్ కుమార్‌కు గతంలో నీట్ పేపర్ లీక్ వివాదం సమయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎదుర్కొన్న పరిస్థితే ఎదురుకానుందా? అనే చర్చ మొదలైంది. సీజేపీ అధినేత అభిజీత్ దీప్కే మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు కూడా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌నే బాధ్యుడిగా పేర్కొన్నారు. అయితే ఈ మూడు ఎన్నికలు జ్ఞానేశ్ కుమార్ నియామకానికి ముందే జరిగాయని సోషల్ మీడియాలో పలువురు ఫ్యాక్ట్ చెకర్లు చెబుతున్నారు.
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో సీజేపీ చేపట్టిన నిరసనను మొదట ముంబైలో ప్రారంభించింది. ముంబైలోని శివాజీ పార్క్‌లో తొలి దశ ఆందోళన చేపట్టిన అనంతరం అక్టోబర్ 10న ఢిల్లీలో రెండో దశ నిరసన నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితా, సర్ వంటి అంశాలపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలకు సీజేపీ కూడా తన స్వరాన్ని జోడించింది. ఇందుకోసం సోషల్ మీడియా ట్రెండ్లను ఉపయోగించుకోవడం సీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. గతంలో ‘స్కూల్ ఠీక్ కరో’ వంటి ఉద్యమాలపై దృష్టి పెట్టిన సీజేపీ.. ప్రస్తుతం సర్, ఎన్నికల సంఘం వంటి చర్చనీయాంశాలపై దృష్టి సారించింది. ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయని విమర్శిస్తున్న ప్రతిపక్షాలు అదే ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నాయని సీజేపీ ప్రశ్నిస్తోంది. ఎన్నికలను బహిష్కరించకుండా విమర్శలు చేయడంపై కూడా నిలదీస్తోంది.
నీట్ పేపర్ లీక్ వివాదం సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీనిని ఉదాహరణగా తీసుకుని జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరడం సమంజసం కాదని విశ్లేషకులు అంటున్నారు. ఇద్దరి పరిస్థితులు పూర్తిగా భిన్నమని చెబుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ నేత, కేంద్ర మంత్రి. కానీ జ్ఞానేశ్ కుమార్ రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల సంఘానికి ప్రధాన ఎన్నికల కమిషనర్... ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించేందుకు రాజ్యాంగంలో ప్రత్యేకమైన ప్రక్రియ ఉంది. అందువల్ల రాజకీయ నిరసనలు లేదా సోషల్ మీడియా ట్రెండ్ల ఆధారంగా ఆయన పదవి ఊడిపోతుందని చెప్పడం సరికాదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఢిల్లీ కాలుష్యం: ఆరేళ్ల తర్వాత మళ్లీ అధ్వాన్నం!


