నాగ్‌పూర్: అన్నం వడ్డించనందుకు ఓ మహిళను ఆమె భర్త కొట్టి చంపాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణలాల్ (41) అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి భార్య యామిని మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టం పరీక్షలో తీవ్ర గాయాలు ఉన్నట్లు తేలడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
సీనియర్ ఇన్స్పెక్టర్ హరేశ్ కల్సేకర్ మాట్లాడుతూ.. కృష్ణలాల్ పని ముగించుకుని ఇంటికి వచ్చి తన భార్య యామినిని భోజనం వడ్డించాలని అడిగాడని తెలిపారు. అయితే యామిని అందుకు నిరాకరించి, తాను డ్యాన్స్ క్లాస్‌కు వెళ్లాలనుకుంటున్నానని, భోజనం అతడే వడ్డించుకోవాలని చెప్పినట్లు తెలిపారు.
దీంతో దంపతుల మధ్య మొదలైన విభేదం తొలుత వాగ్వాదానికి, ఆ తర్వాత భౌతిక ఘర్షణకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు. గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వారి ఫ్లాట్‌లో మహిళలకు డ్యాన్స్ ప్రాక్టీస్ సెషన్లు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఘర్షణ సమయంలో ఆగ్రహానికి గురైన కృష్ణలాల్ యామినిపై తీవ్రంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మెడ, పొత్తికడుపుపై లోతైన గాయాలయ్యాయి. ఆ గాయాలు ప్రాణాంతకంగా మారడంతో యామిని మృతి చెందింది.
పోస్టుమార్టంతో అనుమానాలు
యామిని మృతి తర్వాత పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే యామిని కుటుంబ సభ్యులకు ఏదో తప్పు జరిగిందనే అనుమానం కలిగింది. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం పరీక్ష నిర్వహించాలని వారు పట్టుబట్టారు. పరీక్షలో తీవ్ర గాయాలు ఉన్నట్లు తేలడంతో పోలీసులు ఆమె భర్తను ప్రశ్నించి అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో యామినిని హత్య చేసినట్లు కృష్ణలాల్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పోలీసులు అతడిని అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడి వయసు 14 ఏళ్లు కాగా, చిన్న కుమారుడి వయసు 4 ఏళ్లు.


