
దేశంలోని వివిధ నగరాల్లోని లక్షలాది మంది ప్రజలు మెట్రో రైళ్లలో ప్రయాణాలు సాగిస్తుంటారు. సమయం ఆదాతోపాటు ట్రాఫిక్ సమస్య ఉండదనే కారణంతో చాలామంది తమ ప్రయాణాలకు మెట్రోనే ఎంచుకుంటారు. అయితే మెట్రో రైళ్లను రాత్రి వేళ ఎందుకు నడపరనే విషయం చాలామందికి తెలియదు. దీని వెనుకనున్న కారణం తెలిస్తే, ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.
దేశంలో తొలి రైలు ప్రయాణం 1853లో ముంబై- థానే మధ్య ప్రారంభమైంది. పదేళ్ల తరువాత 1863లో ప్రపంచంలోనే మొట్టమొదటి మెట్రో రైలు సేవలు లండన్‌లో ప్రారంభమయ్యాయి. ఇది పట్టణాల్లో వేగవంతమైన రవాణా వ్యవస్థల ప్రారంభానికి నాంది పలికింది. దేశంలోనే మొట్టమొదటి మెట్రో సేవలు 1984లో కోల్‌కతాలో ప్రారంభమయ్యాయి. ఇది ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి ప్రధాన నగరాల్లో మెట్రో నెట్‌వర్క్‌లకు పునాది వేసింది.
ఇప్పుడు భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌కు నిలయంగా మారింది. మెట్రో సేవలు పలు నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. మార్చి 2024 నాటికి, భారతదేశంలోని 17 నగరాలకు మెట్రో సేవలు విస్తరించాయి. దేశంలో మొత్తం 902.4 కిలోమీటర్లు (560.7 మైళ్ళు) మెట్రో లైన్లు ఏర్పడ్డాయి. భారతదేశంలో ఢిల్లీ మెట్రోకు అతిపెద్ద నెట్‌వర్క్ ఉంది. ఢిల్లీ మెట్రో 391 కిలోమీటర్ల పొడవైన మెట్రో లైన్‌తో ఫరీదాబాద్, గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్‌లకు సేవలు అందిస్తుంది . ఢిల్లీ మెట్రోలో మొత్తం 286 స్టేషన్లను ఉన్నాయి. దేశంలో మెట్రో సేవలు ఉదయం 5:30 గంటలకు ప్రారంభమై, అర్ధరాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.
మెట్రోను రాత్రి వేళ నడపకపోవడానికి ప్రధాన కారణం వాటి నిర్వహణ. రాత్రి వేళల్లో ట్రాక్ తనిఖీ, ఓవర్ హెడ్ పరికరాల తనిఖీలు, పగటిపూట సురక్షితమైన కార్యకలాపాలను నిర్ధారించడానికి సిగ్నలింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్‌లు వంటి కీలకమైన నిర్వహణ పనులు చేస్తుంటారు. అలాగే కొత్త ట్రయల్ రన్‌లు, సిబ్బందికి శిక్షణనివ్వడం, కొత్త టెక్నాలజీని పరీక్షించడం లాంటి పనులను మెట్రోలో రాత్రివేళ నిర్వహిస్తుంటారు. మర్నాడు మెట్రోను సజావుగా నడిపేందుకు, ప్రయాణికులకు సురక్షిత ప్రయాణాన్ని అందించేందుకు రాత్రి వేళ మెయింటెనెన్స్ పనులు చేస్తుంటారు. మెట్రో రైళ్లను రాత్రివేళ నడపకపోవడానికి ఇదే ప్రధాన కారణం.