breaking news
operating
-
‘మెట్రో’ను రాత్రి ఎందుకు నడపరు?.. తెలిస్తే.. ఇంతుందా? అంటారు..
దేశంలోని వివిధ నగరాల్లోని లక్షలాది మంది ప్రజలు మెట్రో రైళ్లలో ప్రయాణాలు సాగిస్తుంటారు. సమయం ఆదాతోపాటు ట్రాఫిక్ సమస్య ఉండదనే కారణంతో చాలామంది తమ ప్రయాణాలకు మెట్రోనే ఎంచుకుంటారు. అయితే మెట్రో రైళ్లను రాత్రి వేళ ఎందుకు నడపరనే విషయం చాలామందికి తెలియదు. దీని వెనుకనున్న కారణం తెలిస్తే, ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.దేశంలో తొలి రైలు ప్రయాణం 1853లో ముంబై- థానే మధ్య ప్రారంభమైంది. పదేళ్ల తరువాత 1863లో ప్రపంచంలోనే మొట్టమొదటి మెట్రో రైలు సేవలు లండన్‌లో ప్రారంభమయ్యాయి. ఇది పట్టణాల్లో వేగవంతమైన రవాణా వ్యవస్థల ప్రారంభానికి నాంది పలికింది. దేశంలోనే మొట్టమొదటి మెట్రో సేవలు 1984లో కోల్‌కతాలో ప్రారంభమయ్యాయి. ఇది ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి ప్రధాన నగరాల్లో మెట్రో నెట్‌వర్క్‌లకు పునాది వేసింది.ఇప్పుడు భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌కు నిలయంగా మారింది. మెట్రో సేవలు పలు నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. మార్చి 2024 నాటికి, భారతదేశంలోని 17 నగరాలకు మెట్రో సేవలు విస్తరించాయి. దేశంలో మొత్తం 902.4 కిలోమీటర్లు (560.7 మైళ్ళు) మెట్రో లైన్లు ఏర్పడ్డాయి. భారతదేశంలో ఢిల్లీ మెట్రోకు అతిపెద్ద నెట్వర్క్ ఉంది. ఢిల్లీ మెట్రో 391 కిలోమీటర్ల పొడవైన మెట్రో లైన్‌తో ఫరీదాబాద్, గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్‌లకు సేవలు అందిస్తుంది . ఢిల్లీ మెట్రోలో మొత్తం 286 స్టేషన్లను ఉన్నాయి. దేశంలో మెట్రో సేవలు ఉదయం 5:30 గంటలకు ప్రారంభమై, అర్ధరాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.మెట్రోను రాత్రి వేళ నడపకపోవడానికి ప్రధాన కారణం వాటి నిర్వహణ. రాత్రి వేళల్లో ట్రాక్ తనిఖీ, ఓవర్ హెడ్ పరికరాల తనిఖీలు, పగటిపూట సురక్షితమైన కార్యకలాపాలను నిర్ధారించడానికి సిగ్నలింగ్ సిస్టమ్ అప్గ్రేడ్లు వంటి కీలకమైన నిర్వహణ పనులు చేస్తుంటారు. అలాగే కొత్త ట్రయల్ రన్లు, సిబ్బందికి శిక్షణనివ్వడం, కొత్త టెక్నాలజీని పరీక్షించడం లాంటి పనులను మెట్రోలో రాత్రివేళ నిర్వహిస్తుంటారు. మర్నాడు మెట్రోను సజావుగా నడిపేందుకు, ప్రయాణికులకు సురక్షిత ప్రయాణాన్ని అందించేందుకు రాత్రి వేళ మెయింటెనెన్స్ పనులు చేస్తుంటారు. మెట్రో రైళ్లను రాత్రివేళ నడపకపోవడానికి ఇదే ప్రధాన కారణం. -
ఓలాకు షాక్ : లండన్‌లో బ్యాన్
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ క్యాబ్ సేవల సంస్థ ఓలాకు లండన్‌లో ఎదురు దెబ్బ తగిలింది. ప్రజా రవాణా భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలతో ఓలాకు చెందిన ఆపరేటింగ్ లైసెన్స్ ను లండన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ రద్దు చేసింది. ఓలా భద్రతా చర్యలు నిబంధనలకు అనుగుణంగా లేవని, ప్రయాణీకుల భద్రతను ప్రమాదంలో పడేసిందని పేర్కొంది. ఈ మేరకు ట్రాన్‌పోర్ట్ ఫర్ లండన్ (టీఎఫ్ఎల్) ఒక ప్రకటన జారీ చేసింది. మరో క్యాబ్ సేవల సంస్థ, ఓలా ప్రధాన ప్రత్యర్థి ఉబెర్ గతంలో భద్రతాపరమైన కారణాల రీత్యా ఇలాంటి చర్యలనే ఎదుర్కొంది. అయితే చట్టబద్ధమైన నిబంధనలు తొలగి, లైసెన్స్ తిరిగి సాధించిన సేవలకు సుగమమైన తరుణంలో ఓలాకు వ్యతిరేకంగా తాజా ఆదేశాలు జారీ అయ్యాయి. ఓలా సేవల్లో అనేక వైఫల్యాలను కనుగొన్నట్లు టీఎఫ్ఎల్ తెలిపింది. నిబంధనల ఉల్లంఘనలతో సహా, లైసెన్స్ లేని డ్రైవర్లు వాహనాలను నడుపుతున్నారని వాదించింది. దీనిపై అప్పీల్ చేయడానికి ఓలాకు 21 రోజులు (అక్టోబర్ 24) సమయం ఉందని తెలిపింది. దీనిపై స్పందించిన ఓలా డేటా బేస్‌లో సాంకేతిక లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తిందని వెల్లడించింది. ఈ విషయంలో టీఎఫ్ఎల్ సంస్థతో సంప్రదింపులు జరుపుతామని, పారదర్శకంగా పనిచేయడానికే తమ ప్రాధాన్యత అని ఓలా యూకే ఎండీ మార్క్ రోజెండల్ తెలిపారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. కాగా బెంగళూరుకు చెందిన ఓలా ఈ ఏడాది ఫిబ్రవరిలో లండన్ టాక్సీ మార్కెట్లోకి ప్రవేశించింది. భారతదేశంలో ఉబెర్‌తో పోటీపడుతున్న భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని సంస్థ యుకెతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు తన సేవలను విస్తరించిన సంగతి తెలిసిందే. -
అసలైన ఏలియన్స్ అన్వేషణ మొదలైంది!
బీజింగ్: ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ తన పని ప్రారంభించింది. నైరుతి చైనా గిజూ ప్రావిన్స్‌లోని పర్వతప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ఈ టెలిస్కోప్ ఆదివారం మధ్యాహ్నం నుంచి పనిని ప్రారంభించిందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. విశ్వంలో జీవం కోసం మానవులు సాగిస్తున్న అన్వేషణను ఈ రేడియో టెలిస్కోప్ మరింత ప్రభావవంతంగా చేపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ద ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అపర్చర్ స్పెరికల్ రేడియో టెలిస్కోప్(ఎఫ్ఏఎస్టీ) పేరుతో నిర్మితమైన దీని కోసం చైనా 1.2 బిలియన్ యువాన్లను ఖర్చుచేసింది. ఇప్పటివరకూ ప్రపంచంలో పెద్ద టెలిస్కోప్‌గా పేరున్న ప్యూర్టోరికో లోని అరెసిబో టెలిస్కోప్‌ను ఎఫ్ఏఎస్టీ ద్వితీయ స్థానంలోకి నెట్టేసింది. 30 ఫుట్‌బాల్ మైదానాల పరిమాణంలో ఉంటుందంటే ఎఫ్ఏఎస్టీ ఎంత భారీ టెలీస్కోపో అర్థం చేసుకోవచ్చు. చైనా తన అభివృద్ధిని చాటుకునేలా సైనిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు అంతరిక్ష రంగంలోనూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. 2020 నాటికి శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేసుకునే దిశగా చైనా అడుగులేస్తోంది. ఎఫ్ఏఎస్టీ నిర్మాణాన్ని 2011లో చైనా ప్రారంభించింది. టెలిస్కొప్ వ్యవహారాలను సక్రమంగా నిర్వహించేందుకు గాను ఆ ప్రాంతంలో 5 కిమీ పరిధిలో ఉన్న సుమారు 10 వేల మందిని స్థానిక ప్రభుత్వం ఖాళీ చేయించింది.