వర్షాకాలం ముగింపు దశకు చేరుకున్నా.. బిహార్‌ను వరద కష్టాలు మాత్రం వీడటం లేదు. గంగమ్మ ఉగ్రరూపంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఊళ్లు, రహదారులు, పంట పొలాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజల దైనందిన జీవనం అస్తవ్యస్తమైంది. వరద ఉధృతిని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న సోషల్ మీడియా వీడియోలు పరిస్థితి తీవ్రతను చాటుతున్నాయి. నీటమధ్య చిక్కుకున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతుండగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నా పలు ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది.
భాగల్‌పూర్ జిల్లా సుల్తాన్‌గంజ్ వద్ద గంగానది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. సెప్టెంబర్ 11 ఉదయం అక్కడ నీటిమట్టం 36.62 మీటర్లకు చేరింది. ఇది ప్రమాద స్థాయి కంటే 2.12 మీటర్లు ఎక్కువ. అయితే ఈ ఉదయం అక్కడ నీటిమట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ పలు చోట్ల నదీ రక్షణ కట్టలు దెబ్బతినడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
వర్షం తక్కువైనా.. వరద ఎలా?
ఈసారి బిహార్ వరదలకు ఒకే కారణం లేదని అధికారుల వివరణ, తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. ఆసక్తికరంగా.. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు బిహార్‌లో సాధారణం కంటే 27 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ 1 నాటికి వర్షపాతం లోటు దాదాపు 30 శాతంగా ఉంది. అంటే కొద్దిరోజుల క్రితం వరకు రాష్ట్రం వర్షాభావ పరిస్థితినే ఎదుర్కొంది.
ఆ తర్వాతే ఒక్కసారిగా నదుల్లో ప్రవాహం పెరగడంతో వరద పరిస్థితి తలెత్తింది. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి గంగా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, వారాణసి పరిసర ప్రాంతాలతో పాటు ఎగువ గంగా పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల నీరు గంగలోకి చేరి దిగువకు ప్రవహించింది. దీంతో బిహార్‌లో గంగానది నీటిమట్టం వేగంగా పెరిగింది.
అంతేకాదు.. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన నీటి ప్రవాహం, బిహార్‌లో అక్కడక్కడ కురిసిన వర్షాలు కూడా పరిస్థితిని తీవ్రం చేశాయి. గంగా నీటిమట్టం పెరగడంతో దానిలో కలిసే చిన్న, పెద్ద నదుల నీరు వెనక్కి నిలిచే బ్యాక్‌వాటర్ ప్రభావం ఏర్పడింది. దీంతో ఇప్పటికే నీటితో నిండిన ప్రాంతాల్లో ముంపు మరింత పెరిగింది.
నేపాల్ వర్షాల పాత్ర ఎంత?
బిహార్ వరదల ప్రస్తావన వచ్చినప్పుడల్లా నేపాల్ పేరు ముందుకు వస్తుంది. కారణం.. ఉత్తర బిహార్‌లోని అనేక ప్రధాన నదులు నేపాల్ హిమాలయ ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ రాష్ట్రంలోకి రావడమే. కోసి, గండక్, బాగ్మతి వంటి నదులకు ఎగువ పరీవాహక ప్రాంతాలు నేపాల్‌లో ఉన్నాయి. అక్కడ భారీ వర్షాలు కురిస్తే దిగువ ప్రాంతాలకు ఒక్కసారిగా భారీగా నీరు చేరే అవకాశం ఉంటుంది.
ఆగస్టు చివరి వారంలో నేపాల్‌లోని కొన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు నమోదయ్యాయి. దీంతో ఆ ప్రాంతాల నుంచి వచ్చే నదుల్లోనూ ప్రవాహం పెరిగింది. దీనికి తోడు.. ఈసారి గంగా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలు, అక్కడి నుంచి వచ్చిన వరదనీరు ముంచెత్తాయి.
బిహార్‌కే వరద ముప్పు ఎందుకింత?
బిహార్ భౌగోళిక స్వరూపమే ఆ రాష్ట్రాన్ని వరదలకు అత్యంత సున్నితంగా మారుస్తోంది. ముఖ్యంగా ఉత్తర బిహార్ హిమాలయాల నుంచి వచ్చే నదులు విస్తారమైన మైదాన ప్రాంతాల్లోకి ప్రవేశించే ప్రాంతం. కొండ ప్రాంతాల్లో వేగంగా ప్రవహించే నదులు మైదానాల్లోకి వచ్చిన తర్వాత ప్రవాహ వేగం తగ్గుతుంది. దీంతో అవి తీసుకొచ్చే ఇసుక, మట్టి, సిల్ట్ నదీ పడగలో పేరుకుపోతాయి. దీంతో నదుల నీటిని మోసుకెళ్లే సామర్థ్యం తగ్గి, భారీ ప్రవాహం వచ్చినప్పుడు నీరు ఒడ్డులను దాటి బయటకు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. గంగా, కోసి, గండక్, బాగ్మతి, బుడి గండక్, ఘాఘ్రా, మహానంద, పున్‌పున్ వంటి నదులు బిహార్‌లోని వివిధ ప్రాంతాలకు వరద ముప్పును కలిగిస్తుంటాయి. ముఖ్యంగా కోసి నది తరచూ తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం, భారీగా సిల్ట్ పేరుకుపోవడం వల్ల ఉత్తర బిహార్‌లో వరద సమస్య తీవ్రంగా ఉంటుంది. అందుకే కోసిని చాలాకాలంగా ‘బిహార్ దుఃఖదాయిని’గా పిలుస్తారు.
#WATCH | Bhagalpur, Bihar: Over 90 panchayats and several urban areas in the Bhagalpur area remain severely flooded. NH-80 on the Bhagalpur-Patna route has been shut near Bhavnathpur for five days as floodwater flows nearly two feet deep across the road. Floodwaters have also… pic.twitter.com/nuVuW3LYNa
— ANI (@ANI) September 12, 2026
రక్షణ కట్టలకూ గండం
అదే సమయంలో వరదనీరు గ్రామాలు, పట్టణాలు, పంట పొలాల్లోకి చేరకుండా నదుల వెంట నిర్మించే ఎత్తైన కట్టలను రక్షణ కట్టలు అంటారు. బిహార్‌లో దశాబ్దాలుగా ఇలాంటి కట్టలపై ఆధారపడి వరద నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. అయితే నదుల్లో నీటిమట్టం భారీగా పెరిగినప్పుడు ఈ కట్టలపై నీటి ఒత్తిడి కూడా పెరుగుతుంది. తాజా వరదల్లో భాగల్‌పూర్‌లో పలు ప్రాంతాల్లో రక్షణ కట్టలు దెబ్బతినడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఒకచోట కట్ట తెగితే పెద్ద మొత్తంలో నీరు ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామాలు, రహదారులు, పొలాల్లోకి దూసుకెళ్లే ప్రమాదం ఉంటుంది.
లక్షల మందిపై ప్రభావం
తాజా అధికారిక సమాచారం ప్రకారం 15 జిల్లాల్లో 46.88 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు. 88 బ్లాకులు, 561 గ్రామ పంచాయతీల్లో ముంపు పరిస్థితులు నెలకొన్నాయి. రహదారులు, ఇతర రవాణా మార్గాలు దెబ్బతినడంతో అనేక ప్రాంతాల్లో పడవలే ప్రజలకు ప్రధాన రవాణా మార్గంగా మారాయి. భాగల్‌పూర్‌లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. అక్కడ వరదనీటిలో చిక్కుకున్న వారిని తరలించేందుకు పడవలను ఉపయోగిస్తున్నారు. తాజాగా వరదనీటిలో ఒక వ్యక్తిని రక్షించే ప్రయత్నంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో పాటు మరో వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన కూడా చోటుచేసుకుంది.
The floods in Bihar should now be declared a national disaster, and immediate assistance should be provided to Bihar. pic.twitter.com/H2YlFNH6HW
— Sameera Jain (@SameeraJain6) September 7, 2026
సహాయక చర్యలు ముమ్మరం
వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. దాదాపు 33 రెస్క్యూ బృందాలు, సుమారు 700 ప్రభుత్వ పడవలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
వరద ప్రభావిత ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం అందిస్తున్నారు. పెద్ద సంఖ్యలో కమ్యూనిటీ కిచెన్లు పనిచేస్తున్నాయి. పొడి రేషన్, పాలిథిన్ షీట్లు తదితర సహాయ సామగ్రిని పంపిణీ చేస్తున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం బోటు అంబులెన్సులను కూడా వినియోగిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం 1,194 కమ్యూనిటీ కిచెన్లు పనిచేస్తున్నాయి.
ఇప్పుడేం జరుగుతోంది?
కొన్ని ప్రాంతాల్లో గంగానది నీటిమట్టం స్వల్పంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నా.. పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదు. సుల్తాన్‌గంజ్‌లో నీటిమట్టం తగ్గుముఖం పట్టినా ప్రమాద స్థాయికి రెండు మీటర్లకు పైగా ఎగువన ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు రక్షణ కట్టలపై నీటి ఒత్తిడి కొనసాగుతోంది.
ప్రతి ఏటా వరదలు వచ్చినప్పుడు సహాయక చర్యలు చేపట్టడం మాత్రమే కాకుండా.. నదుల్లో పేరుకుపోయే సిల్ట్ నిర్వహణ, రక్షణ కట్టల బలోపేతం, వరద ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, నదుల ప్రవాహ మార్గాలపై శాస్త్రీయ అధ్యయనాలు, దీర్ఘకాలిక వరద నిర్వహణపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని తాజా పరిస్థితి మరోసారి గుర్తుచేస్తోంది.
వైరల్ ఫెర్రీ వీడియో సంగతేంటి?
ఇక భారీగా ప్రయాణికులతో నిండిన ఫెర్రీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో సుమారు 200 మంది ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వీడియో ప్రస్తుత బిహార్ వరదలకు సంబంధించినదా? పాతదా? లేదా ఏఐ సాయంతో రూపొందించిందా? అనేది క్లారిటీ లేదు. అయితే జులై చివరి వారంలోనే ఓ యూట్యూబ్ చానెల్‌లో ఈ వీడియో అప్‌లోడ్ కావడం గమనార్హం. అయితే ప్రస్తుత వరద పరిస్థితుల్లో రోడ్డు మార్గాలు దెబ్బతినడంతో పడవలపై ప్రజలు ఆధారపడుతున్న విషయం మాత్రం వాస్తవం.
This is not an ocean; this is the Mighty Ganges in Bihar. pic.twitter.com/ecSUSLCahb
— Magadh Updates (@magadh_updates) September 11, 2026

ఇదీ చదవండి: దుర్మార్గులు: ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ కావట్లేదని..


