చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చెన్నై తాంబరం రోడ్డుకు మేజర్ ముకుంద్ వరదరాజన్ పేరు పెట్టారు. భారత ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ సాహసానికి, త్యాగానికి నివాళిగా చెన్నైలోని వేలచ్చేరి - తాంబరం రోడ్డును 'మేజర్ ముకుంద్ వరదరాజన్''గా మారుస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద నిరోధక చర్యలకు నాయకత్వం వహిస్తూ మేజర్ ముకుంద్ వరదరాజన్ వీరమరణం పొందారు. ఆయన ప్రదర్శించిన అసాధారణ తెగింపుకు, శౌర్యానికి గాను అప్పట్లో ప్రభుత్వం ఆయన మరణానంతరం ఆయనకు అశోక్ చక్రను ప్రదానం చేసింది. దేశానికి ఆయన చేసిన సేవలను గౌరవిస్తూ.. ఆయన త్యాగాన్ని భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునేలా చేసేందుకు చెన్నైలోని ఈ కీలకమైన రహదారికి ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాగా, బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లు నిషేధం విధిస్తూ.. తమిళనాడు సర్కార్ ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా రోడ్లపై, వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు అంటించడం నిషేధమని స్పష్టం చేసింది. ఇటీవల రాష్ట్రంలో భారీ కటౌట్లు, పోస్టర్లు పాదచారుల రాకపోకలకు అడ్డంకిగా మారాయి.
పాదచారులు రోడ్లపైకి రావడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు పెరిగాయి. వర్షాకాలం ప్రారంభం కావడంతో బ్యానర్లు, కటౌట్ల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గత నెలలో పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు, బస్ స్టాండ్‌లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను విజయ్ మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకుకున్నారు.


