
ముంబై పేలుళ్లకు ప్రతీకారం తీర్చుకోనివ్వలేదు
మాజీ హోం మంత్రి చిదంబరం వ్యాఖ్య
న్యూఢిల్లీ: 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోకుండా యూపీఏ ప్రభుత్వంపై అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోం మంత్రి పి.చిదంబరం తెలిపారు. ముఖ్యంగా అమెరికా ప్రభావం, విదేశాంగ శాఖ విధానం వల్లే మిన్నకుండిపోవాల్సి వచ్చిందన్నారు. ప్రతీకారం తీర్చుకోవాలని తనకు లోలోపల ఉన్నప్పటికీ ప్రభుత్వం సైనికపరమైన ప్రతిచర్యకు విముఖంగా ఉందని ఓ వార్తా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. దాదాపు 175 మంది ప్రాణాలను బలి తీసుకున్న కొద్ది రోజులకే హోం మంత్రిగా తాను బాధ్యతలు తీసుకున్నానన్నారు.
యుద్ధానికి దిగవద్దంటూ ప్రపంచ దేశాల నేతలు ప్రభుత్వంపై ఒత్తిళ్లు తెచ్చారన్నారు. ‘అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి కండోలిజా రైస్ నేను బాధ్యతలు తీసుకున్న రెండు మూడు రోజుల్లోనే ఢిల్లీకి వచ్చారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌ని, నన్ను కూడా కలిశారు. ‘దయచేసి రియాక్షన్ తీసుకోకండి’అని ఆమె కోరారు. ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని ఆమెకు చెప్పాను. పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని బలంగా అనిపిస్తున్నా ఆ విషయం ఆమెకు తెలియపర్చలేదు. బదులు తీర్చుకునే విషయమై ప్రధానితోపాటు సంబంధిత వర్గాలతో సంప్రదించా’అని చిదంబరం వెల్లడించారు.
అడ్డుకున్నది ఎవరు?
కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. విదేశాల ఒత్తిళ్ల వల్లే ముంబై దాడుల విషయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిన విషయం అందరికీ తెల్సిందేనని పేర్కొంది. అయితే, పాక్‌పై ప్రతిచర్యలు తీసుకోకుండా అడ్డుకున్నది సోనియా గాంధీనా లేక ప్రధాని మన్మోహన్ సింగా అని ప్రశ్నించింది.