మనం కలిసే ఉన్నామా?.. ఉద్ధవ్ వ్యాఖ్యల కలకలం | Uddhav Thackeray Question To MVA unity Are we really together | Sakshi
Sakshi News home page

మనం కలిసే ఉన్నామా?.. ఉద్ధవ్ వ్యాఖ్యల కలకలం

Jun 25 2026 10:36 AM | Updated on Jun 25 2026 10:49 AM

Uddhav Thackeray Question To MVA unity Are we really together

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (MVA) కూటమిలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయా? మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే చేసిన తాజా వ్యాఖ్యలు చూస్తే అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. తన పార్టీకి చెందిన ఆరుగురు లోక్‌సభ సభ్యులు షిండే శిబిరంలో చేరిన నేపథ్యంలో ఉద్ధవ్ థాక్రే..‘మనం నిజంగానే కలిసి ఉన్నామా?’ అంటూ కూటమి భాగస్వాములనే ప్రశ్నించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇటీవల శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు అధికార శివసేన నేత ఏక్‌నాథ్‌ షిండే వర్గంలో చేరడం ఉద్ధవ్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఈ పరిణామం తర్వాత పార్టీ శ్రేణులతో సమావేశమైన ఉద్ధవ్.. కేవలం పార్టీ అంతర్గత పరిస్థితులపైనే కాకుండా, కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం)తో కలిసి ఉన్న ఎంవీఏ కూటమి ఐక్యతపైనా సందేహాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఫిరాయింపుతో పెరిగిన ఒత్తిడి
2022లో ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటుతో పార్టీ చీలిన తర్వాత ఉద్ధవ్ థాక్రే ఇప్పటికే భారీ రాజకీయ నష్టాన్ని చవిచూశారు. ఇప్పుడు ఆరుగురు ఎంపీలు కూడా పార్టీని వీడటంతో ఆయన నాయకత్వంపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష శిబిరం బలపడుతుందని భావించిన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ఉద్ధవ్‌కు ఇబ్బందికరంగా మారింది.

ఎంవీఏలో సమన్వయం లోపిస్తోందా?
ఉద్ధవ్ వ్యాఖ్యల వెనుక అసలు కారణం కేవలం ఎంపీల ఫిరాయింపులే కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రాజకీయ వ్యూహాలు, నాయకత్వ అంశాల్లో ఎంవీఏ భాగస్వాముల మధ్య పూర్తి స్థాయి సమన్వయం లేదనే భావన శివసేన (యూబీటీ)లో పెరుగుతోందని చెబుతున్నారు. అందుకే మనం నిజంగానే కలిసి ఉన్నామా? అనే ప్రశ్న ద్వారా ఉద్ధవ్ తన మిత్రపక్షాలకు పరోక్షంగా హెచ్చరిక పంపినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు షిండే వర్గం మాత్రం దీనిని ఉద్ధవ్ నాయకత్వ వైఫల్యంగా అభివర్ణిస్తోంది. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు వరుసగా బయటకు వస్తుండటం ఉద్ధవ్‌పై విశ్వాసం తగ్గిపోవడానికే నిదర్శనమని ఆ వర్గం వాదిస్తోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో షిండే-బీజేపీ కూటమి మరింత బలపడుతుండగా, ప్రతిపక్ష శిబిరంలో అనిశ్చితి పెరుగుతోందని పేర్కొంటోంది.

ముందున్న సవాళ్లు
ఎంవీఏ కూటమికి రాబోయే స్థానిక ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. ఈ సమయంలో భాగస్వామ్య పార్టీల మధ్య ఐక్యతపై అనుమానాలు వ్యక్తమవడం ప్రతిపక్షానికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఉద్ధవ్ థాక్రే పార్టీని కాపాడుకోవడమే కాకుండా, కూటమి భాగస్వాములను ఒకే తాటిపైకి తీసుకురావాల్సిన సవాలు కూడా ఎదుర్కొంటున్నారు. మొత్తానికి ఉద్ధవ్ వేసిన ప్రశ్న ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఇది కేవలం ఒక వ్యాఖ్య మాత్రమేనా? లేక ఎంవీఏలో పెరుగుతున్న అసంతృప్తికి సంకేతమా? అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement