సాక్షి, చెన్నై : కన్యాకుమారి జిల్లా కిల్లియూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే , మంత్రి రాజేష్ కుమార్ ఎన్నికను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించేందుకు టీవీకే అభ్యర్థి సబీన్ నిర్ణయించారు. ఆయన గెలుపు చెల్లదని ప్రకటించాలని కోరుతూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికలలో 1,311 ఓట్లతో రాజేష్ కుమార్ సబీన్‌పై గెలిచారు. సోమవారం సబీన్ స్వయంగా కన్యాకుమారి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించిన ఫిర్యాదు లేఖను కిల్లియూర్ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కౌన్సిల్ కార్యదర్శి , ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు కూడా పంపినట్టు ఆయన తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు చేశారు.
పోస్టల్ ఓట్ల నిర్లక్ష్యం : ఎన్నికల నిబంధనల ప్రకారం లెక్కింపు జరపాల్సిన అనేక పోస్టల్ ఓట్లను అధికారులు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ నిర్దేశిత సమయం కంటే ముందే, అంటే ఉదయం 6 గంటలకే ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారని వివరించారు. సాంకేతిక లోపం పేరిట ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు సరిగ్గా జరగలేదని, తాము ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా, కౌంటింగ్ అధికారులు సరైన వివరణ ఇవ్వకుండా రకరకాల కారణాలు చెబుతూ తుది ఫలితాన్ని ఏకపక్షంగా ప్రకటించారని సబీన్ ఆరోపించారు.
నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ లెక్కింపు ఆధారంగా ప్రకటించిన రాజేష్ కుమార్ విజయాన్ని తక్షణమే రద్దు చేయాలని సబీన్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం జరగకపోతే, త్వరలోనే ఉన్నత న్యాయస్థానాన్ని (హైకోర్టు) ఆశ్రయించి ఎన్నికల పిటిషన్ దాఖలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు.కాగా టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే గెలుపును వ్యతిరేకిస్తూ అధికార పక్షం అభ్యర్థి న్యాయ పోరాటానికి సిద్ధం కావడం చర్చకు దారి తీసింది.


