
అమెరికాతో అప్పటిదాకా ఉన్న భారత్ స్నేహబంధం.. ట్రంప్ 2.0 రాకతో ఒక్కసారిగా చేదెక్కింది. మిత్రదేశం అంటూనే సుంకాల మోత మోగించారాయన. అటుపై ఉక్రెయిన్ యుద్ధాన్ని వంక పెట్టుకుని రష్యాతో ఇండియా మైత్రిని తీవ్రంగా తిట్టిపోస్తూ వచ్చారు. దీనికి తోడు వాణిజ్య ఒప్పందంపై ఎటూ తేల్చకుండా నానుస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో.. ఈ చర్చల్లో పురోగతి, మోదీపై ప్రశంసలతో ఆయన వెనక్కి తగ్గారనే అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన పాక్‌కు ప్రాధాన్యత ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ దరిమిలా..
అమెరికా అధ్యక్షుడిని భారత్‌కు మిత్రుడిగా చూడడం ఇక కష్టమేనంటున్నారు పశ్చిమబెంగాల్‌లోని బహారంపూర్ ప్రజలు. మోదీ ఎంత స్నేహంగా ఉంటున్నా.. ట్రంప్ మాత్రం మోసం చేశారని రగిలిపోతున్నారు. ఆ కోపంతో అక్కడి దుర్గా పూజ మండపంలో ఏకంగా ట్రంప్‌ను మహిషాసురుడి అవతారంలో(Trump Demon Statue) ఏర్పాటు చేశారు. పూజా కమిటీ సభ్యుడు ప్రతీక్ మాట్లాడుతూ.. ‘‘మోదీ ఎంతో స్నేహంగా ఉంటున్నప్పటికీ ట్రంప్ సుంకాలు విధించి మోసం చేశాడు. మన దేశంపై అధర్మంగా వాణిజ్య యుద్ధానికి దిగాడు. అందుకే రాక్షసుడిగా చిత్రీకరించాం’’ అని అన్నారు.
బహారంపూర్‌లోని ఖాగ్రా శ్మశాన ఘాట్ దుర్గాపూజా(Durga Puja Trump) కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ విగ్రహాన్ని అసిం పాల్ అనే కళాకారుడు రూపొందించాడు. అయితే అది ట్రంప్‌ను దృష్టిలో ఉంచుకుని తానేం రూపొందించలేదని ఆయన అంటుండడం గమనార్హం. బహారంపూర్ మునిసిపాలిటీ మేయర్ నారు గోపాల్ ముఖర్జీ (టీఎంసీ) ఈ మండపాన్ని ప్రారంభించారు. దుర్గమ్మ సన్నిధిలో మహిషాసురుడిగా ట్రంప్ అనే విషయం తెలిసి భక్త జనం ఈ మండపానికి ఎగబడిపోతున్నారు. అయితే..

కిందటి ఏడాది కూడా ఇదే మండపం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్జీకర్ హత్యాచార ఘటన నేపథ్యంలో ఆ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ రూపంతో మహిషాసురుడి విగ్రహాన్ని తయారు చేశాడు.
ట్రంప్‌ను భారత్‌లో రాక్షసుడిగానే కాదు.. దేవుడిగానూ కొలిచిన సందర్భం ఉందని మీకు తెలుసా?.. తెలంగాణలోని జనగాం కోన్నె గ్రామంలో బుస్సా కృష్ణ అనే రైతు ట్రంప్ ఫొటోను ఇంట్లో ఉంచుకుని పూజిస్తూ వచ్చాడు(Trump Temple India). ఆ మరుసటి ఏడాది 2019లో తన ఇంటి ప్రాంగణంలో రూ. 2 లక్షల వ్యయంతో 6 అడుగుల ట్రంప్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. విగ్రహానికి నిత్యం పూలు, కుంకుమ, పాలాభిషేకం చేస్తూ వార్తల్లోకి ఎక్కాడు. అయితే 2020లో ట్రంప్ కరోనా బారినపడినప్పుడు ఆ బెంగతో మంచం పట్టి.. ఆపై గుండెపోటుతో కృష్ణ మరణించాడు. అటుపై ఆయన కుటుంబం ఆ విగ్రహానికి పూజలు చేస్తూ వచ్చింది. అయితే.. తాజా టారిఫ్ వార్ నేపథ్యంలో ఈ విగ్రహం గురించి పలువురు సోషల్ మీడియాలో ఆరా తీయడం గమనార్హం.
