breaking news
mahisasurudi
-
దుర్గమ్మ సన్నిధిలో మహిషాసురుడిగా ట్రంప్!
అమెరికాతో అప్పటిదాకా ఉన్న భారత్ స్నేహబంధం.. ట్రంప్ 2.0 రాకతో ఒక్కసారిగా చేదెక్కింది. మిత్రదేశం అంటూనే సుంకాల మోత మోగించారాయన. అటుపై ఉక్రెయిన్ యుద్ధాన్ని వంక పెట్టుకుని రష్యాతో ఇండియా మైత్రిని తీవ్రంగా తిట్టిపోస్తూ వచ్చారు. దీనికి తోడు వాణిజ్య ఒప్పందంపై ఎటూ తేల్చకుండా నానుస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో.. ఈ చర్చల్లో పురోగతి, మోదీపై ప్రశంసలతో ఆయన వెనక్కి తగ్గారనే అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన పాక్‌కు ప్రాధాన్యత ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ దరిమిలా.. అమెరికా అధ్యక్షుడిని భారత్‌కు మిత్రుడిగా చూడడం ఇక కష్టమేనంటున్నారు పశ్చిమబెంగాల్లోని బహారంపూర్ ప్రజలు. మోదీ ఎంత స్నేహంగా ఉంటున్నా.. ట్రంప్ మాత్రం మోసం చేశారని రగిలిపోతున్నారు. ఆ కోపంతో అక్కడి దుర్గా పూజ మండపంలో ఏకంగా ట్రంప్‌ను మహిషాసురుడి అవతారంలో(Trump Demon Statue) ఏర్పాటు చేశారు. పూజా కమిటీ సభ్యుడు ప్రతీక్ మాట్లాడుతూ.. ‘‘మోదీ ఎంతో స్నేహంగా ఉంటున్నప్పటికీ ట్రంప్ సుంకాలు విధించి మోసం చేశాడు. మన దేశంపై అధర్మంగా వాణిజ్య యుద్ధానికి దిగాడు. అందుకే రాక్షసుడిగా చిత్రీకరించాం’’ అని అన్నారు. బహారంపూర్లోని ఖాగ్రా శ్మశాన ఘాట్ దుర్గాపూజా(Durga Puja Trump) కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ విగ్రహాన్ని అసిం పాల్ అనే కళాకారుడు రూపొందించాడు. అయితే అది ట్రంప్‌ను దృష్టిలో ఉంచుకుని తానేం రూపొందించలేదని ఆయన అంటుండడం గమనార్హం. బహారంపూర్ మునిసిపాలిటీ మేయర్ నారు గోపాల్ ముఖర్జీ (టీఎంసీ) ఈ మండపాన్ని ప్రారంభించారు. దుర్గమ్మ సన్నిధిలో మహిషాసురుడిగా ట్రంప్ అనే విషయం తెలిసి భక్త జనం ఈ మండపానికి ఎగబడిపోతున్నారు. అయితే..కిందటి ఏడాది కూడా ఇదే మండపం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్జీకర్ హత్యాచార ఘటన నేపథ్యంలో ఆ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ రూపంతో మహిషాసురుడి విగ్రహాన్ని తయారు చేశాడు. ట్రంప్‌ను భారత్‌లో రాక్షసుడిగానే కాదు.. దేవుడిగానూ కొలిచిన సందర్భం ఉందని మీకు తెలుసా?.. తెలంగాణలోని జనగాం కోన్నె గ్రామంలో బుస్సా కృష్ణ అనే రైతు ట్రంప్ ఫొటోను ఇంట్లో ఉంచుకుని పూజిస్తూ వచ్చాడు(Trump Temple India). ఆ మరుసటి ఏడాది 2019లో తన ఇంటి ప్రాంగణంలో రూ. 2 లక్షల వ్యయంతో 6 అడుగుల ట్రంప్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. విగ్రహానికి నిత్యం పూలు, కుంకుమ, పాలాభిషేకం చేస్తూ వార్తల్లోకి ఎక్కాడు. అయితే 2020లో ట్రంప్ కరోనా బారినపడినప్పుడు ఆ బెంగతో మంచం పట్టి.. ఆపై గుండెపోటుతో కృష్ణ మరణించాడు. అటుపై ఆయన కుటుంబం ఆ విగ్రహానికి పూజలు చేస్తూ వచ్చింది. అయితే.. తాజా టారిఫ్ వార్ నేపథ్యంలో ఈ విగ్రహం గురించి పలువురు సోషల్ మీడియాలో ఆరా తీయడం గమనార్హం. -
విజయాల స్ఫురణ
నవరాత్రులు పూర్తయిన తరువాతి రోజును విజయదశమిగా పిలుస్తారు. అమ్మవారు పది చేతులతో మహిషాసురుడిని సంహరించిన రోజిది. దశాయుధ పోరాటం కనుకనే విజయదశమి అన్నారు. దశ దుర్గుణాలను సంహరించినందుకు కూడా ఇది విజయదశమి. అమ్మవారు, రాములవారు వేర్వేరు కాలాల్లోనే అయినా ఈ ముహూర్తంలోనే దుష్టసంహారం చేశారు. అందుకే ఆ దేవతామూర్తులను స్మరించుకుంటూ... వారి సమరస్ఫూర్తిని స్ఫురణకు తెచ్చుకుందాం. ఇంతకూ ఈ విజయం ఎలా సిద్ధిస్తుందీ అంటే జ్ఞానం చేత. అంటే శారదాదేవి అనుగ్రహం వల్ల. అంటే శరన్నవరాత్రులను ఉపాసించటం వలన. మహిషాసురుడు అంటే పశుప్రవృత్తి కలిగినవాడు. మనలోని అజ్ఞానానికి మహిషాసురుడికీ ఏమాత్రం భేదం లేదు. రావణాసురుడి పదితలలూ ఈ దుర్గుణాలకే సంకేతం. దైవబలం, ఉపాసనాశక్తి చేత ఈ పదింటినీ నిర్మూలించటమే మహిషాసుర, రావణాసుర సంహారం. ఈ రెండూ విజయ దశమిరోజే జరిగాయి కాబట్టి విజయ దశమి మహా పర్వదినంగా మనం చెప్పుకుంటున్నాం. అజ్ఞాతవాస సమయంలో పాండవులు తమ ఆయుధాల్ని శమీ (జమ్మి)వృక్షంపై దాచిపెట్టినట్లు తదుపరి విరాటరాజు వద్ద కొలువు పొందినట్లు మనకు మహాభారతం వివరిస్తుంది. అజ్ఞాతవాస వత్సరకాలం పాండవుల ఆయుధాల్ని సంరక్షించిన శమీవృక్షాన్ని పరమ పవిత్ర వృక్షంగా దసరా రోజు పూజించడం మనం చూస్తున్నాం. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ అనే శ్లోకాన్ని జపిస్తూ జమ్మిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం, కాగితం మీద పై శ్లోకాన్ని రాసి విజయ దశమిరోజు జమ్మిచెట్టుపై దాచడం వల్ల ఆ సంవత్సరం అంతా విజయ పరంపర కలుగుతుందనీ శత్రుపీడా నివారణం జరుగుతుందనీ నమ్మకం. అలాగే శమీపత్రాన్ని బంగారంగా భావించి పంచుకోవడాన్ని కూడా మనం చూడవచ్చు. విజయదశమిరోజు జమ్మిచెట్టుతోపాటు పాలపిట్టనూ దర్శనం చేసుకోవడం మనకు కనిపిస్తుంది. పాలపిట్ట మనశ్శాంతికీ ప్రశాంతతకూ కార్యసిద్ధికీ సంకేతం. పాండవులు జమ్మిచెట్టు మీద దాచిన తమ ఆయుధాలకు సంవత్సరం పాటు ఇంద్రుడు పాలపిట్ట రపంలో కాపుకాశాడని జానపదులు చెబుతుంటారు. ఎవరైనా ఆ చెట్టు మీద దాచిన ఆయుధాలను చూస్తే వారికవి శవంలాగా లేదా విషసర్పాలుగా కనిపిస్తాయనీ, అయినా ఎవరైనా వాటిని స్పృశించటానికి ప్రయత్నిస్తే అప్పుడు ఇంద్రుడు పాలపిట్ట రూపంలో వారిని తరిమికొడతాడనీ జనపదం. అందుకే దసరారోజు పాలపిట్టను చూడాలని తపిస్తారు. అపరాజితాదేవి ఆమె చేపట్టిన ప్రతికార్యం జయాన్ని చేకూర్చేదే. అందుకే దసరా సందర్భంగా ఆమెను అపరాజితాదేవిగా రాజరాజేశ్వరీ దేవిగా అలంకరిస్తారు. కొలిచిన వారికి కొంగుబంగారంగా భాసిల్లే ఆ చల్లనితల్లి... ప్రతిఒక్కరూ తమతమ కార్యాలను సక్రమంగా, విజయవంతంగా నిర్వర్తించుకునే ధైర్య, శౌర్య, సాహసాలను ప్రసాదించి, తన ఆశీస్సులను అందిస్తుంది. సృష్టిస్థితిలయలకు ఆధారభూతమైన ఆ జగజ్జననిని పూజించినవారికి, ఆరాధించిన వారికి... సకల విఘ్నాలనూ తొలగి, అన్నింటా విజయాలు, సుఖాలు, శుభాలు చేకూరతాయి. అక్షరానికి ఆధారమైన గాయత్రీదేవిని, శ్రీచక్రానికి మూలమైన శ్రీలలితాపరమేశ్వరీదేవిని, శ్రీచక్రంలోని సమస్త మంత్రాక్షరాలకూ కేంద్రమైన శ్రీరాజరాజేశ్వరీదేవిని, అన్నపానీయాలకు ఆధారభూతమైన అన్నపూర్ణమ్మను... అనేకానేక దివ్యశక్తులను తననుండి సృజించిన మహోన్నత దివ్యశక్తి ఆ త్రిభువనైక సుందరి.ఆమె లేనిదే ఈ చరాచర విశ్వమే లేదు. అంతటి దివ్యతేజోమూర్తిని సంవత్సరమంతా స్మరించాలి, పూజించాలి. అందుకు కుదరనివారు నవరాత్రులు తొమ్మిదిరోజులూ, అదీ కుదరని వారు అయిదు రోజులు, కుదరకపోతే మూడు రోజులూ, ఓపిక లేనివారు కనీసం విజయదశమి రోజున అయినా పూజిస్తే... తన బిడ్డల కోర్కెలను ఆమె తీరుస్తుంది. - చిర్రావూరి కృష్ణకిశోర్ శర్మ ఆధ్యాత్మికవేత్త


