కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ)లో సంక్షోభం మరింత ముదిరింది. టీఎంసీకి చెందిన మంది ఎంపీలు బీజేపీలోకి వెళ్లేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇక, ఇప్పటికే టీఎంసీలు ఎమ్మెల్యేలు 60 మంది వేరు కుంపటి పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు మాజీ సీఎం మమతా బెనర్జీకి ఊహించని షాక్ ఇస్తున్నాయి.
తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై రాజకీయ చర్చలు బలంగా జరుగుతున్నాయి. ఇటీవల బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ మాట్లాడుతూ.. 18–20 మంది టీఎంసీ ఎంపీలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో అంతర్గత అసంతృప్తి, పునర్వ్యవస్థీకరణ జరుగుతోందని వార్తలు వచ్చాయి. పార్టీ తన కమిటీలు, అనుబంధ విభాగాలను రద్దు చేసి పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించింది. కాగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ 29 స్థానాలు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లో ఒకటిగా నిలిచింది.
ఇదిలా ఉండగా, అంతకుముందు.. బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ చీలికతో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నెగ్గిన రీతాబ్రత బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో భారీ తిరుగుబాటు చెలరేగింది. మొత్తం 80 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది ఆయనకు మద్దతుగా సంతకాలు చేయడం.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై తీవ్ర సవాల్‌ను విసిరినట్లయ్యింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిన వెంటనే పార్టీలో అసంతృప్తి వేగంగా పెరిగింది. పార్టీ అధినేత్రి నివాసంలో జరిగిన కీలక సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది(దాదాపు 60 మంది) గైర్హాజరు కావడం పరిస్థితి తీవ్రతను చూపించింది. అంతేకాకుండా, మమతా నిర్వహించిన బహిరంగ నిరసన కార్యక్రమానికి కూడా చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకావడం పార్టీలో లోతైన విభేదాలను బయటపెట్టింది. విశ్లేషకుల ప్రకారం.. ఇది సిద్ధాంత ఆధారిత తిరుగుబాటు కాదు. ఇది మమతా నాయకత్వంపై అసంతృప్తి, అలాగే ప్రతిపక్ష నేత పదవి సహా అధికార పంపకాలపై ఉన్న ఆగ్రహం కలయికగా కనిపిస్తోంది.


