NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది? | Three students in Bengaluru missed their NEET re-examination allegedly due to traffic | Sakshi
Sakshi News home page

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

Jun 22 2026 7:08 PM | Updated on Jun 22 2026 7:21 PM

Three students in Bengaluru missed their NEET re-examination allegedly due to traffic

సాక్షి,బెంగళూరు: కర్ణాటకలో నీట్‌ పరీక్షపై రాజకీయ దుమారం రేగింది. బెంగళూరులో కాంగ్రెస్‌ నిర్వహించిన ర్యాలీ కారణంగానే ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మీడియా ఎదుట వాపోయిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆదివారం జరిగిన ఈ సంఘటన విద్యార్థులు, తల్లిదండ్రులు, రాజకీయ పార్టీల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. నిన్న దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు నీట్‌ యూజీ రీ-టెస్ట్‌ రాసినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే బెంగళూరులో కాంగ్రెస్‌ నిర్వహించిన ర్యాలీ కారణంగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి, పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. విద్యార్థులు 1.30 గంటలకు రిపోర్ట్‌ చేయాలని విద్యాశాఖ సూచించింది. కానీ ట్రాఫిక్‌ పెరగడంతో తల్లిదండ్రులు బైక్‌లను ఫుట్‌పాత్‌లపై నడిపే పరిస్థితి వచ్చింది. చివరికి ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా చేరుకోవడంతో పరీక్షకు అనుమతి ఇవ్వలేదు. వారు గేటు ఎక్కి లోపలికి వెళ్లాలని ప్రయత్నించినా, నిర్వాహకులు గేట్లను మూసివేశారు.

అయితే తల్లిదండ్రులు కాంగ్రెస్‌ ర్యాలీని తప్పుబట్టారు. 7 కిలోమీటర్ల దూరం సాధారణంగా 20 నిమిషాల్లో పూర్తవుతుంది. కానీ ర్యాలీ కారణంగా 35 నిమిషాలకుపైగా పట్టింది. పిల్లల భవిష్యత్తు కోసం ర్యాలీలు నగర బయట జరగాలి అని ఓ తండ్రి  అసహంన వ్యక్తం చేశారు. మరొకరు రాహుల్ గాంధీ విద్యార్థుల కోసం కోటాకు వెళ్లారు. కానీ ఆయన పార్టీ ర్యాలీ వల్ల నలుగురు విద్యార్థులు పరీక్ష మిస్సయ్యారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?  అని ప్రశ్నించారు.

ఈ ఘటనపై బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ‘కాంగ్రెస్ అధికార దాహం కోసం ఎంత వరకు దిగజారుతుంది?’ అంటూ వీడియోను షేర్‌ చేశారు. దీనికి కాంగ్రెస్ మంత్రి ప్రియాంక్ ఖర్గే ‘కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదు. గత దశాబ్దంలో 89 పేపర్ లీకులు జరిగాయి’ అని ప్రతిస్పందించారు.

కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్ ‘కొంతమంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విన్నాను. వారికి కలిగిన అసౌకర్యంపై విచారం వ్యక్తం చేస్తున్నాను. కానీ బీజేపీ పాలనలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికి వారు క్షమాపణ చెప్పారా?’అని ప్రశ్నించారు. జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి ఈ ఘటనను ప్రభుత్వానికి అవమానకరమైన పరిణామంగా అభివర్ణించారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement