సాక్షి, చైన్నె: తమిళనాడులో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ కూటమి నుంచి తమిళ మానిల కాంగ్రెస్ (మూపనార్) పార్టీ వైదొలగింది. ఈ విషయాన్ని టీఎంసీ (ఎం) అధ్యక్షుడు జీకే వాసన్ ప్రకటించారు. పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్య బాధ్యులతో సమగ్రంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు తెలిపారు. 12 ఏళ్ల క్రితం స్థాపితమైన తమ పార్టీ గతంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయని ఆయన చెప్పారు.
ఎన్డీఏలో ప్రాధాన్యత లేదు: నేతల ఆగ్రహం
చైన్నె ఎగ్మోర్‌లో ఆదివారం జీకే వాసన్ అధ్యక్షతన టీఎంసీ (ఎం) అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. తమిళనాడు నలుమూలల నుంచి వచ్చిన రాష్ట్ర, జిల్లా స్థాయి నిర్వాహకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో మెజారిటీ నాయకులు ఎన్డీఏ కూటమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ కూటమిలో తమ పార్టీకి దక్కాల్సిన కనీస ప్రాధాన్యత, గౌరవం దక్కడం లేదని, కాబట్టి కూటమి నుండి తక్షణమే వైదొలగాలని జీకే వాసన్‌ను కోరారు. మరికొందరు నేతలు ఒంటరిగా ప్రయాణించడం లేదా ప్రత్యామ్నాయాల వైపు చూడటం మంచిదని అభిప్రాయపడ్డారు.
అవకాశవాద రాజకీయాలు పెరిగాయి
నాయకుల అభిప్రాయాలను విన్న అనంతరం జీకే వాసన్ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడులో అవకాశవాద రాజకీయాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. ఎన్నికల్లో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్న వారు, ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారన్నారు. ఏదో ఒక పార్టీ గుడ్డిగా సాహసం చేసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినంత మాత్రాన.. వారే ఎల్లకాలం విజయం సాధిస్తారని తాను భావించడం లేదన్నారు.
చదవండి: విజయ్ ప్రభుత్వంపై రజినీకాంత్ సతీమణి నో కామెంట్
ఒక పార్టీ స్థిరంగా రాణించాలంటే బలమైన సంస్థాగత నిర్మాణంతో పాటు సరైన సంకీర్ణం అవసరంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ఎప్పుడో బలహీనపడిందని, టీఎంసీ ఏర్పడి 12 ఏళ్లు అవుతున్నా అంతర్గతంగా కొన్ని లోపాలు ఉన్నాయని, అందుకే ఒక్క ఎన్నికలలోనూ గెలవలేక పోయినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికిని చాటుకోవాలని భావిస్తున్నామని, అందుకే ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగే వరకు స్వతంత్రంగా వ్యవహరిస్తామని, బలోపేతం దిశగా వెళ్తామన్నారు.


