
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో బాబా స్వామి చైతన్యానంద సరస్వతి(స్వామి పార్థసారథి)(Swami Chaitanyananda Saraswati)విద్యార్థినులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. విద్యార్థినులు తమ ఫిర్యాదులో బాబాపై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. కాగా, ప్రస్తుతం చైతన్యానంద సరస్వతి పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.
వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన స్వామి చైతన్యానంద సరస్వతి(స్వామి పార్థసారథి) ఢిల్లీలోని వసంత్‌కుంజ్( Vasant Kunj) ప్రాంతంలో శ్రీ శారద ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. గత 12 ఏళ్లుగా ఆయన ఇక్కడే ఉంటున్నాడు. ఆర్థికంగా బలహీనవర్గాలకు చెందిన వారంతా ఉపకార వేతనాలతో ఈ విద్యాసంస్థలో చదువుకుంటున్నారు. అయితే, చైతన్యానంద సరస్వతి తమతో అసభ్య పదజాలాన్ని వాడుతూ దుర్భాషలాడటం, సందేశాలు పంపడమే కాకుండా లైంగికంగా వేధింపులకు గురిచేశాడని విద్యార్థినులు ఆరోపించారు.
విద్యా సంస్థలో ఉన్న 32 మంది విద్యార్థుల్లో 17 మంది ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలని ఇతర మహిళా అధ్యాపకులు, ఇతర సిబ్బంది కూడా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఆశ్రమంలో పనిచేసే వార్డెన్లే తమను నిందితుడికి పరిచయం చేశారని వాపోయారు. ఈ వాంగ్మూలాల ఆధారంగా తాము కేసు నమోదు చేశామని పోలీసు ఉన్నతాధికారి అమిత్ గోయల్ వెల్లడించారు. ఇక, ఈ వ్యవహారంలో సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలిపారు. నిందితుడు ఉండే ప్రాంతంతో సహా బాధితులు పేర్కొన్న స్థలాల్లో తనిఖీలు చేశారు.
ఇది కూడా చదవండి: యూపీలో సరికొత్త అధ్యాయం.. ఉమెన్ పోలీసింగ్ పవర్ ఇది..
కాగా, విద్యార్థినుల ఫిర్యాదు తర్వాత చైతన్యానంద సర్వసతి కనిపించడం లేదు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని, చివరిగా అతడి లొకేషన్‌ను ఆగ్రా సమీపంలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే విద్యాసంస్థకు చెందిన బేస్‌మెంట్‌లో ఒక కారు గుర్తించిన పోలీసులు.. దానికి ఉన్నది నకిలీ నంబర్ ప్లేట్ అని వెల్లడించారు. ఇక, ఆయనపై ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. 2009లో మోసం, లైంగిక వేధింపు కేసు నమోదైంది. 2016లో వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఒక మహిళ కూడా ఈ తరహా వేధింపుల పైనే ఫిర్యాదు చేయడం గమనార్హం.